T20 World Cup : ఫైనల్‌కు వెళ్లేది ఆ రెండు జట్లే: సునీల్‌ గావస్కర్‌

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరేదెవరు..? కప్‌ గెలిచేదెవరు? అంటూ పలువురు అంచనాలు వేస్తున్నారు. మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా తన ఫెవరేట్‌ జట్లేంటో వెల్లడించాడు.

Published : 18 Oct 2022 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  టీ20 ప్రపంచకప్‌ టోర్నీ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. పసికూనలాంటి జట్లు మాజీ చాంఫియన్లు, దిగ్గజ జట్టను మట్టికరిపిస్తుండటంతో.. టోర్నీ ఆరంభంలోనే అసలు సిసలు క్రికెట్‌ మజాను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఇక అసలైన సూపర్‌ 12 గ్రూప్‌ మ్యాచ్‌లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్‌ చేరేదెవరు..? కప్‌ గెలిచేదెవరు? అంటూ పలువురు అంచనాలు వేస్తున్నారు. మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా తన ఫెవరేట్‌ జట్లేంటో వెల్లడించాడు.

ఈ ప్రపంచకప్‌ టోర్నీలో ఎంతో బలంగా కనిపిస్తున్న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు వెళ్తాయని గావస్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టామ్‌ మూడీ కూడా గావస్కర్‌తో ఏకీభవించాడు. ఈ రెండు జట్లే ఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా వేశాడు.

‘భారత్‌ కచ్చితంగా ఫైనల్‌కు చేరుతుంది. ఇక నేను ఆస్ట్రేలియాలో ఉన్నందున ఆసీస్‌ పేరు చెబుతున్నాను’ అని ఓ క్రీడా ఛానల్‌తో ముచ్చటిస్తూ సన్నీ చెప్పాడు. టామ్‌ మూడీ మాట్లాడుతూ..‘ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఒక గ్రూప్‌ నుంచి.. పాక్‌, భారత్‌ మరో గ్రూప్‌ నుంచి సెమీస్‌కు వెళ్తాయి. ఇక ఫైనల్‌ ఆసీస్‌, భారత్‌ మధ్య ఉంటుంది’ అని వివరించాడు.

ఇక టీమ్‌ ఇండియా తన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి టోర్నీకి ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. రెండో వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది. సూపర్‌ 12లో ఈ నెల 23న రోహిత్‌ సేన తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని