Rinku Singh: మరో యువీగా రింకు.. అతడిలో కొంచెం సాధించినా చాలు: గావస్కర్

ఇప్పుడందరి నోటా వస్తున్న పేరు రింకు సింగ్‌ (Rinku Singh). ఈ ఎడమచేతివాటం బ్యాటర్ లోయర్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఆటాడేసుకుంటున్నాడు.

Published : 11 Dec 2023 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో (IPL) సుడిగాలి ఇన్నింగ్స్‌తో భారత జట్టులోకి వచ్చిన రింకు సింగ్‌ (Rinku Singh) తన సత్తా నిరూపించుకున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుతమైన ‘ఫినిషర్’గా మారిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనలోని టీ20లతోపాటు వన్డే ఫార్మాట్‌కూ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో రింకు సింగ్‌ను భవిష్యత్తు యువరాజ్‌గా అభివర్ణిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. భారత్‌ జట్టు సగర్వంగా తలెత్తుకోవడంలో యువరాజ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడని.. రింకు సింగ్‌ కూడా అలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గావస్కర్‌ ప్రశంసించాడు. 

‘‘భారత జట్టులో భాగస్వామిగా మారిన రింకు సింగ్‌ తన దూకుడైన శైలిలోనే ఆడుతున్నాడు. అతడిపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు యువరాజ్‌ సింగ్‌తో పోలుస్తూ వాటిని మరింత పెంచేశారు. టీమ్‌ఇండియా కోసం యువీ చేసిన కృషిలో రింకు కొంత చేసినా చాలు అద్భుతమవుతుంది. వన్డే ప్రపంచ కప్‌ 2011లో యువీ ఏ విధమైన ప్రదర్శన చేశాడో మనమంతా చూశాం. అంతకుముందు 2007 పొట్టి కప్‌ను నెగ్గడంలోనూ కీలక పాత్ర పోషించాడు.

రింకు సింగ్‌ విషయంలోనూ ఇదే జరగాలని ఆకాంక్షిద్దాం. ప్రతిభ అనేది ఎవరికీ ఇచ్చేది కాదు. స్వతహాగా వచ్చేది. ఆటను ప్రేమిస్తూ ఉండాలి. నిరంతరం ఆడుతూ ఉండాలి. ఒక్కోసారి టాలెంట్‌ ఉన్నా అవకాశాలు త్వరగా రావు. కానీ, ఎప్పుడు ఛాన్స్‌ వచ్చినా సాధించగలననే నమ్మకంతో ఉండాలి. గత రెండు మూడేళ్లు రింకు సింగ్‌ చేసిందదే. ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నప్పటికీ ఎక్కువ మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. కానీ, వచ్చిన ఛాన్స్‌ను అందిపుచ్చుకుని విజృంభించాడు. ఇప్పుడు భారత జట్టులోకే వచ్చేశాడు’’ అని గావస్కర్‌ తెలిపాడు.

రింకును ఆరో స్థానంలోనే ఆడించాలి: కలిస్‌

‘‘రింకు సింగ్ క్లాసిక్‌ ప్లేయర్. గత కొన్ని మ్యాచుల్లో అతడు ఆడిన తీరు చూస్తేనే అర్థమైపోతుంది. చాలాసార్లు ‘ఫినిషింగ్‌’ పాత్ర పోషించాడు. పక్కాగా క్రికెటింగ్‌ షాట్లతో అలరించాడు. ఇన్నింగ్స్‌ ముగింపులో దూకుడుగా ఆడటంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. అందుకే, రింకు సింగ్‌ను ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపించాలి. మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’’ అని దక్షిణాఫ్రికా మాజీ టాప్‌ ఆల్‌రౌండర్ కలిస్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని