WTC Final: క్లిష్టసమయంలో కీలక ఇన్నింగ్స్.. రహానె ప్రత్యేకత అదే: సునీల్ గావస్కర్
మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానె (89) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC FINAL)లో భారత్ పోరాడగలుగుతోంది. అతడితోపాటు శార్దూల్ (51), రవీంద్ర జడేజా (48) విలువైన పరుగులు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) భారత టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ అజింక్య రహానె (89) మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్ (51), రవీంద్ర జడేజాతో (48)తో కలిసి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో అతడి ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రహానెను అభినందిస్తూనే ‘ప్రచారం కోరుకోని ఆటగాడు’ అంటూ పేర్కొన్నాడు. తాను ఏం సాధించినా వాటిపై దృష్టిపెట్టకుండా ముందుకు సాగిపోతాడని తెలిపాడు.
‘‘ఏదైనా మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సమయంలోనూ రహానెను చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాడు. అవన్నీ, భారత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసినవే. పరిస్థితిని బట్టి ఆడటం అతడి ప్రత్యేకత. ఇలా ‘లో ప్రొఫైల్’తో ఉండే ప్లేయర్ల జాబితాలో రహానె తప్పక ఉంటాడు. సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించిన సమయంలో తన ఛాతీని పెద్దదిగా చేసి చూపించడు. కేవలం తన బ్యాట్‌ను మాత్రమే ఎత్తి అభివాదం చేస్తాడు. ఆ తర్వాత కామ్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తాడు’’ అని గావస్కర్ చెప్పాడు.
రోహిత్ ఔట్.. ఆశ్చర్యం కలిగించలేదు
భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఔటైన తీరు బాగాలేదని సునీల్ గావస్కర్ తెలిపాడు. ‘‘బంతిని సరిగా అంచనా వేయడంలో ఓపెనర్లు ఇద్దరూ పొరపడ్డారు. మరీ ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. భారత్‌కు ఇదే తొలి పెద్ద దెబ్బ. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లోనూ గొప్పగా ఆడలేదు. అందుకే, రోహిత్ ఔటైన విధానంపై నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ, పుజారా కూడా ఇలాగే ఆసీస్ బుట్టలో పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఆఫ్‌స్టంప్స్‌ను సరిగా కవర్ చేయకుండా క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ బౌలర్లు ఫుల్లర్ లెంగ్త్‌తో బంతులను సంధించి ఫలితం రాబట్టారు’’ అని వ్యాఖ్యానించాడు.
రహానె సూపర్బ్: ఏబీ డివిలియర్స్
అర్దశతకం సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానెను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభినందించాడు. ‘‘క్రీజ్‌లో రహానె ఇలా యాక్టివ్‌గా కదలడం మునుపెన్నడూ చూడలేదు. అతడి టెక్నిక్ సూపర్బ్. ఆసీస్ బౌలింగ్‌ను కాచుకుని ఆడటం అద్భుతం’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.