IND vs AFG: దంచికొట్టిన జైస్వాల్‌-దూబె.. సిరీస్‌ భారత్‌ కైవసం

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Updated : 14 Jan 2024 22:25 IST

ఇందౌర్‌: టీమ్ఇండియా అదరహో. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి జైస్వాల్ (68; 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబె (63*; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో అలరించారు. విరాట్ కోహ్లీ (29; 16 బంతుల్లో 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడాడు. రోహిత్‌ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌ అయి నిరాశపరిచాడు. అఫ్గాన్‌ బౌలర్లలో కరీం జనత్ 2, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, నవీనుల్ హక్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ బ్యాటర్లలో వన్‌డౌన్‌ బ్యాటర్ గుల్బాదిన్ నైబ్ (57; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకం చేశాడు. నజీబుల్లా జద్రాన్‌ (23; 21 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. కరీం జనత్ (20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), ముజీబుర్ రెహ్మాన్‌ (21; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. అందులో మూడు రనౌట్‌లు కావడం విశేషం. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2, అక్షర్‌ పటేల్ 2, శివమ్‌ దూబె ఒక వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు