Team India: బుమ్రా, షమి లాంటి బౌలర్లను వెనక్కినెట్టే పేసర్లు భారత్‌కున్నారు

టీమ్‌ఇండియాకు ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో తగినంత మంది నైపుణ్యమైన బౌలర్లు ఉన్నారని, వారు కచ్చితమైన వేగంతో బంతులేయగలరని ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం బ్రెట్‌లీ పేర్కొన్నాడు...

Published : 02 Aug 2021 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాకు ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో తగినంత మంది నైపుణ్యమైన బౌలర్లు ఉన్నారని, వారు కచ్చితమైన వేగంతో బంతులేయగలరని ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం బ్రెట్‌లీ వెల్లడించాడు. మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా లాంటి మేటి బౌలర్లను కూడా వెనక్కినెట్టే సత్తా ప్రస్తుత యువకులకు ఉందన్నాడు. దాంతో సీనియర్లు తప్పుకునే సమయానికి వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా వరుస విజయాలకు బలమైన రిజర్వ్‌ బెంచ్‌ ఉండటమే కీలకమని వెల్లడించాడు.

‘టీమ్‌ఇండియాకు అనుభవజ్ఞులైన బౌలర్లు ఉండటమే కాకుండా జట్టులో ప్రతిభావంతులైన యువ పేసర్లు కూడా ఉన్నారు. దాంతో ఆ జట్టు తగినంత పేస్ బౌలింగ్‌ యూనిట్‌ను సొంతం చేసుకుంది. దాంతో బుమ్రా, షమి లాంటి మేటి ఆటగాళ్ల నుంచి యువకులు బౌలింగ్‌ భారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ట్రెండ్‌ టీమ్‌ఇండియాకు రాబోయే 10-15 ఏళ్లు ఉపయోగపడుతుంది. ఒకవేళ కుదిరితే అది 20 ఏళ్ల వరకూ కొనసాగుతుంది. ఏ జట్టు అయినా అద్భుతమైన ప్రదర్శన చేయడానికి బలమైన రిజర్వ్‌ బెంచ్‌ ఉండటం ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా విజయానికి అదే అసలైన నిదర్శనం’ అని బ్రెట్‌లీ ఐసీసీతో చెప్పుకొచ్చాడు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ జట్లంటే కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే కాదని, ఒక్కోసారి 16-17 మంది ఆటగాళ్లు కూడా ఉంటారని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ పేర్కొన్నాడు. పరిస్థితులకు లోబడి బాగా ఆడే ఆటగాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ఆటగాళ్లు బయోబుడగలో ఎక్కువకాలం గడపాల్సి వస్తుందని, దాంతో వారు మరింత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారని బ్రెట్‌లీ అన్నాడు. మరికొంత మంది ఆటగాళ్లు నిరుత్సాహ పడతారని కూడా వివరించాడు. బలమైన రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లు ఉంటే ఏ జట్టు అయినా విజయాలు సాధిస్తుందని బ్రెట్‌లీ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని