
IPL 2021: కోహ్లీ తర్వాత బెంగళూరు కెప్టెన్ ఎవరంటే..!
ఇంటర్నెట్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ 14వ సీజన్ తర్వాత ఆ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఏబీ డివిలియర్స్ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతడు సరైన ఎంపిక కాదని క్రికెట్ విశ్లేషకుల భావన. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా బెంగళూరు జట్టుకు ముగ్గురి పేర్లను సూచించాడు.
ఓ క్రికెట్ ఛానల్‌తో మాట్లాడిన మంజ్రేకర్ విచిత్రంగా ఇతర జట్ల ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించాడు. అందుకు కారణాలు కూడా ఉన్నాయన్నాడు. అతడు సూచించిన పేర్లలో ముంబయి ఇండియన్స్ ప్రధాన ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఒకటి కాగా, రెండోది అదే జట్టుకు చెందిన సూర్యకుమార్ యాదవ్. ఇక మూడో ఆటగాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్. మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఒక వేళ డివిలియర్స్‌ను బెంగళూరు కెప్టెన్‌గా ఎంపిక చేస్తే ఎంతకాలం కొనసాగుతాడని సందేహం వెలిబుచ్చాడు. తన ఉద్దేశం ప్రకారం కనీసం మూడేళ్లు ఒక ఆటగాడు కెప్టెన్‌గా కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. పొలార్డ్ (34) వయసు కాస్త ఎక్కువే అయినా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆటగాడని చెప్పాడు.
ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాళ్లను తయారుచేసిన జట్టు నుంచే నాయకుడిని ఎంపిక చేయాలని మంజ్రేకర్ సూచించాడు. ముంబయి ఇప్పటికే ఐపీఎల్‌లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విండీస్ క్రికెటర్ బెంగళూరుకు సరైన ఎంపిక అని వివరించాడు. అదే జట్టులోని సూర్యకుమార్ యాదవ్ కూడా ఆ బాధ్యతలు చేపట్టగలడని అన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ టీమ్‌ను ఒకసారి ఛాంపియన్‌గా నిలబెట్టి తర్వాత ప్రతిసారీ ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన వార్నర్ కూడా కోహ్లీ టీమ్‌కు సరిపోతాడని చెప్పాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.