Team India: అంతపెద్ద టీమ్‌ఇండియా.. ఇంత ఒత్తిడికి ఎలా గురైంది?

టీమ్‌ఇండియా ఆటతీరు పట్ల ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టైటిల్‌ ఫేవరెట్‌గా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై సెమీస్‌కు...

Published : 02 Nov 2021 10:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటతీరు పట్ల ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టైటిల్‌ ఫేవరెట్‌గా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమై సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఆటతీరు ఏమాత్రం ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓడాక కూడా రెండో మ్యాచ్‌లో తమ తప్పులు తెలుసుకున్నట్లు కనిపించలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ సైతం టీమ్‌ఇండియా ఆటతీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కోహ్లీసేన బ్యాటింగ్‌ చూసి షాకయ్యానన్నాడు.

‘భారత్‌-పాక్‌ తర్వాత ఇదే అతిపెద్ద మ్యాచ్‌. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ కన్నా భారత్‌-న్యూజిలాండ్‌దే కీలకం‌. అయితే, టీమ్‌ఇండియా ఆడిన తీరుతో నేను షాక్‌కు గురయ్యా. ఆటగాళ్లంతా మనోస్థైర్యం కోల్పోయారు. అంతపెద్ద జట్టు ఇంత ఒత్తిడికి ఎలా గురైందో అర్థంకావడం లేదు. కివీస్‌ స్పిన్నర్లు మెరుగైన బౌలర్లే అయినా.. ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు మాత్రం కాదు. వాళ్లు వేసే బంతులకు భారత బ్యాట్స్‌మన్‌ సింగిల్స్‌ కూడా తీయలేకపోయారు. జట్టు సారథి విరాట్‌ కోహ్లీ బలమే స్పిన్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవడం. అలాంటిది అతడే పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు’ అని ఇంజమామ్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో అభిప్రాయపడ్డాడు. కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 151/7 స్కోర్‌ చేసిన టీమ్‌ఇండియా.. కివీస్‌తో మరింత పేలవ ప్రదర్శన(110/7) చేసింది. దీంతో ఆ రెండు జట్లు టీమ్‌ఇండియాపై ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ముందున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని