IRE vs IND: ఐర్లాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్‌.. ఎవరికి విశ్రాంతి.. ఎవరికి అవకాశం?

ఐర్లాండ్‌ పర్యటనలో (IRE vs IND) చివరి టీ20 మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. తుది జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు.

Published : 23 Aug 2023 14:45 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్‌ను పట్టేశాం.. ఇక చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసి భారత్‌కు బయల్దేరడమే తరువాయి. బౌలింగ్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. మినీ టోర్నీ ఆసియా కప్‌ కోసం జట్టును కూడా ప్రకటించారు. ఇక మిగిలిన యువకులకు అవకాశం ఇవ్వడంపైనే టీమ్‌ఇండియా(Team India) దృష్టి పెట్టాల్సి ఉంటుంది. డబ్లిన్‌ వేదికగా జరగనున్న మూడో టీ20 (IRE vs IND) మ్యాచ్‌ రివ్యూపై ఓ లుక్కేద్దాం.. 

మినీ టోర్నీగా పిలుచుకునే ఆసియా కప్‌ 2023కు ముందు టీమ్‌ఇండియా ఆడనున్న చివరి టీ20 మ్యాచ్‌. ఇప్పటికే ఆసియా కప్‌ కోసం జట్టును కూడా బీసీసీఐ ప్రకటించేసింది. ఇప్పుడు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతున్న బుమ్రా, ప్రసిధ్, సంజూ శాంసన్‌ (రిజర్వ్‌డ్‌), తిలక్‌ వర్మకు ఆసియా కప్‌ జట్టులో స్థానం దక్కింది. ఈ క్రమంలో వారు గాయాలపాలు కాకుండా మిగిలిన ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, బౌలర్ల రీప్లేస్‌ చేయడం సులువే కానీ, బ్యాటర్ల విషయంలో మాత్రం కష్టమే. సంజూ, తిలక్‌ను పక్కన పెడితే వారిద్దరికి బదులు జట్టులోకి తీసుకోవడానికి బ్యాటర్లు ఎవరూ లేరు. అయితే, జితేశ్ శర్మ ఉండటం వల్ల సంజూను బెంచ్‌కే పరిమితం చేయొచ్చు. అయితే, బ్యాటింగ్‌లో ఫామ్‌ అందుకోవడానికి ఈ మ్యాచ్‌లోనూ ఆడాలి. తిలక్‌కు బదులు జితేశ్‌ను తీసుకోవడం ఉత్తమ నిర్ణయమవుతుంది. ఇద్దరూ ఎడమ చేతివాటం బ్యాటర్లే కావడం విశేషం. ఇక సారథి బుమ్రా విశ్రాంతి తీసుకుని డిప్యూటీగా ఉన్న రుతురాజ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తాడా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. 

బౌలర్లుగా వారిద్దరు.. ఆల్‌రౌండర్‌గా అతడు 

అవేశ్ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ మాత్రమే ఈ సిరీస్‌లో ఆడని పేసర్లు. ఇప్పుడు ప్రసిధ్‌, బుమ్రాలో ఒకరితోపాటు అర్ష్‌దీప్‌నకు విశ్రాంతి ఇచ్చి వారిని తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షహబాజ్ అహ్మద్‌ తన ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. షహబాజ్‌తోపాటు జితేశ్ శర్మ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి బిష్ణోయ్ స్థానానికి ఎలాంటి ఇబ్బంది లేదు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల జాబితాలో బిష్ణోయ్ ఒక్కడే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ బౌలింగ్‌నూ పరీక్షించేందుకు అవకాశం లేకపోలేదు. శివమ్ దూబె కూడా బౌలింగ్‌ చేయగల సమర్థుడే. చివరి మ్యాచ్‌ కావడంతో ఐర్లాండ్‌ కూడా తమ అస్త్రాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. విజయం కోసం చివరి వరకు పోరాడే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. 

వాతావరణం.. పిచ్‌ రిపోర్ట్

రెండో టీ20కి వర్షం అడ్డంకిగా లేకపోవడంతో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. కానీ, చివరి మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. అయితే, మ్యాచ్‌ ఆగే స్థాయిలో మాత్రం వర్షం ఉండకపోవచ్చు. దీంతో టాస్‌ సమయానికి వాతావరణం ఎలా ఉంటుందో... దాని ప్రకారమే బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. 

భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ /జితేశ్ శర్మ, రింకు సింగ్, శివమ్‌ దూబె, షహబాజ్‌ అహ్మద్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిధ్‌ కృష్ణ/అవేశ్ ఖాన్‌, బుమ్రా, ముకేశ్‌ కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని