ICC: ప్రపంచ కప్‌ ఫైనల్‌ హీరోకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ (Travis Head) నవంబర్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 

Published : 11 Dec 2023 16:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ (Travis Head) నవంబర్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత పేసర్ మహ్మద్‌ షమి (Mohammed Shami), ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) కూడా ఈ అవార్డు రేసులో ఉండగా.. చివరకు హెడ్‌ విజేతగా నిలిచాడు. 2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలవడంలో ట్రావిస్ హెడ్ కీలకపాత్ర పోషించాడు. చేతికి వేలి గాయం కారణంగా టోర్నీలో మొదటి సగం మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతడు తర్వాత జట్టులో కీలకంగా మారాడు.  ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడాడు. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై (62) పరుగులు చేసి అతడు.. తుది పోరులోనూ సత్తాచాటాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో కీలకమైన రోహిత్‌ శర్మ క్యాచ్‌ను  అందుకున్నాడు. 241 పరుగుల లక్ష్యఛేదనలో 47/3 స్కోరుతో కష్టాల్లో పడిన ఆసీస్‌ను ట్రావిస్‌ హెడ్ (137; 120 బంతుల్లో) వీరోచిత శతకంతో ఆదుకున్నాడు. దీంతో ఏడు ఓవర్లు మిగిలుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

మహిళల క్రికెట్‌లో బంగ్లాదేశ్ యువ స్పిన్‌ సంచలనం నహిదా అక్టర్ నవంబర్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. బంగ్లా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఫర్గానా, పాక్‌ స్పిన్నర్‌ సాదియా ఇక్బాల్‌ను వెనక్కినెట్టి నహిదా ఈ అవార్డును దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని