Criket News: మైదానంలో కుప్పకూలిన ఇద్దరు క్రికెటర్లు

బౌన్సర్లు తగలడం వల్లో.. డైవ్‌ చేయడం వల్లో ఆటగాళ్లు మైదానంలో పడిపోవడం సాధారణమే! సమస్య ఏంటో తెలియకుండానే స్పృహ తప్పి మైదానంలో కుప్పకూలిపోవడం మాత్రం అరుదు. పది నిమిషాల వ్యవధిలోనే ఒకే జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు అలా పడిపోతే ఆందోళన తప్పదు....

Published : 03 Jul 2021 14:20 IST

ఒక్కసారిగా భయానికి లోనైన సహచరులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బౌన్సర్లు తగలడం వల్లో.. డైవ్‌ చేయడం వల్లో ఆటగాళ్లు మైదానంలో పడిపోవడం సాధారణమే! అయితే హఠాత్తుగా స్పృహ తప్పి మైదానంలో కుప్పకూలిపోవడం మాత్రం అరుదు. పది నిమిషాల వ్యవధిలోనే ఒకే జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు అలా పడిపోతే ఆందోళన తప్పదు. వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ మహిళల క్రికెట్‌ మ్యాచులో ఇలాగే జరగడంతో ఒక్కసారిగా అంతా భయపడిపోయారు.

ఆంటిగ్వాలోని కూలిడ్జ్‌ క్రికెట్‌ మైదానంలో శుక్రవారం వెస్టిండీస్‌, పాక్‌ మహిళల జట్లు రెండో టీ20లో తలపడ్డాయి. మొదట ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ ఛేదన చేస్తుండగా కరీబియన్‌ క్రికెటర్లు చినెల్లి హెన్రీ, చెడీన్ నేషన్‌ పది నిమిషాల వ్యవధిలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహాయ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం వారిద్దరూ స్పృహలోకి వచ్చారని, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. అయితే వారెందుకు మైదానంలో కుప్పకూలిపోయారో ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. వారిని ఆస్పత్రికి తరలించాక మ్యాచ్‌ తిరిగి ఆరంభించారు. వర్షం పడటంతో విండీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో విజయం సాధించింది. మైదానంలో పడిపోయిన చెనెల్లి, చెడీన్‌ ఆరోగ్యం బాగుండాలని పాక్‌ కెప్టెన్ జవేరియా ఖాన్‌ ప్రార్థించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని