Published : 07 Jun 2021 10:03 IST

Cricket News: నేనెందుకు కోచ్‌ కాలేనంటే.. 

ముంబయి: తానెప్పుడూ కోచ్‌గా పని చేయడం గురించి కనీసం ఆలోచించలేదని భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ చెప్పాడు. అపార క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్నా గావస్కర్‌ ఎప్పుడూ కోచ్‌గా పని చేయలేదు. బిషన్‌సింగ్‌ బేడి, వాడేకర్, కపిల్‌ దేవ్‌ లాంటి కోచ్‌లుగా మారినా అతడు ఏనాడూ కోచ్‌ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. అందుకు కారణమేంటన్నది ఇప్పుడు వివరించాడు సన్నీ. తాను కోచ్‌గా సరిపోనని అతనన్నాడు. ‘‘నేను ఆటను ఎక్కువసేపు చూడలేను. ఆడే రోజుల్లోనూ అంతే. నేను ఔటైతే మ్యాచ్‌ను విరామాలతో చూసేవాణ్ని. కాసేపు చూసి చేంజ్‌ రూమ్‌లోకి వెళ్లి ఏదైనా చదువుకునేవాణ్ని లేదా లేఖలకు సమాధానాలు ఇవ్వడం లాంటివి చేసేవాణ్ని. ఆ తర్వాత మళ్లీ వచ్చి మ్యాచ్‌ చూసేవాణ్ని. విశ్వనాథ్, మా అంకుల్‌ మాధవ్‌ మంత్రిలా నేను ప్రతి బంతినీ చూసే రకం కాదు. కోచ్‌ లేదా సెలక్టర్‌ కావాలనుకుంటే ప్రతి బంతినీ చూడాలి. కాబట్టి నేనెప్పుడూ కోచ్‌ కావడం గురించి ఆలోచించలేదు’’ అని గావస్కర్‌ చెప్పాడు. కోచింగ్‌పై ఆసక్తి లేకున్నా.. తన వద్దకు వచ్చే ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని అన్నాడు. ‘‘క్రికెటర్లు నా దగ్గరకి వచ్చేవాళ్లు. ఈతరం వాళ్లు కాదనుకోండి. సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్‌ వంటి వారితో చాలా ఇష్టంగా నా ఆలోచనలు పంచుకునేవాణ్ని. వాళ్లకు సహాయం చేయగలిగా. కానీ పూర్తి స్థాయి కోచ్‌ మాత్రం నేను పనిచేయలేను’’ అని చెప్పాడు.

3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడించాల్సింది 

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తే బాగుంటుందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్‌ అన్నాడు. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం టీమ్‌ఇండియాకు స్వల్ప ప్రతికూలతగా మారొచ్చని తెలిపాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ ‘బెస్ట్‌ ఆఫ్‌ త్రీ’గా నిర్వహిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. మొదటి పోరులో ఓడిపోయినా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో పుంజుకోవచ్చు. న్యూజిలాండ్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేరుకుని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుండటం టీమ్‌ఇండియాకు స్వల్ప ప్రతికూలత. 8 నుంచి 10 ప్రాక్టీస్‌ సెషన్‌లు ఉండొచ్చు. కానీ మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఖాయం. కాకపోతే కివీస్‌కు కాస్త అదనపు ప్రయోజనం ఉంటుంది. కివీస్‌ కంటే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ మెరుగ్గా ఉంది. విదేశాల్లోనూ సత్తాచాటి విజయాలు సాధించారు. బౌలింగ్‌లో కివీస్‌కు ఏమాత్రం     తీసిపోరు’’ అనిని యువీ అన్నాడు.

టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ 

ముంబయి: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అని మాజీ ఆటగాడు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డాడు. ఇరు జట్లలో ఒక్కో ఆటగాడిని పోల్చి చూస్తే భారతే మెరుగ్గా ఉందని తెలిపాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం నష్టం కలిగించొచ్చని పేర్కొన్నాడు. ‘‘భారత్, న్యూజిలాండ్‌లలో ఒక్కో ఆటగాడిని పోల్చి చూస్తే కోహ్లీసేననే మెరుగైన జట్టుగా కనిపిస్తుంది. ట్రెంట్‌ బౌల్ట్, కేన్‌ విలియమ్సన్‌ ప్రపంచ స్థాయి ఆటగాళ్లే అయినా టీమ్‌ఇండియా నాణ్యమైన ఆల్‌రౌండ్‌ జట్టు. అశ్విన్, జడేజాల రూపంలో ఇద్దరు మెరికల్లాంటి స్పిన్నర్లు.. బుమ్రా, ఇషాంత్, షమి, సిరాజ్‌లతో పదునైన పేసర్లు భారత జట్టులో ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. కోహ్లి, రోహిత్‌ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. వాళ్లిద్దరు మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. అయితే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం జట్టుకు నష్టం కలిగించొచ్చు. నెట్స్‌లో ఎంత సాధన చేసినా.. మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు ప్రత్యామ్నాయం లేదు. మైదానంలో ఆడటం బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ఎంతో ముఖ్యం’’ అని వెంగీ అన్నాడు. 

వీళ్ల ఆత్మవిశ్వాసం అయిదు రెట్లెక్కువ 

దిల్లీ: ప్రస్తుత తరం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అయిదు రెట్లు ఎక్కువగా ఉందని టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. శ్రీలంకతో సిరీస్‌పై సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్‌ తమదైన ముద్ర వేయడం ఖాయమని చెప్పాడు. ‘‘నైపుణ్యం విషయంలో అప్పుడు, ఇప్పుడు సమానమే. కానీ మునుపటితో పోల్చుకుంటే ఈతరం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అయిదు రెట్లు ఎక్కువ. తన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. ఇంగ్లాండ్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్‌ మెరుపులు మెరిపించాడు. ఇప్పటి ఆటగాళ్ల ఆత్మవిశ్వాసానికి ఇవన్నీ ఉదాహరణలే. సూర్య, ఇషాన్, సంజులకు శ్రీలంకతో సిరీస్‌ గొప్ప అవకాశం. శ్రీలంకతో సిరీస్‌ను భారత యువ జట్టు గెలిస్తే ఆశ్చర్యపోను’’ అని ప్రసాద్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని