IPL : ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు దూరం.!

ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్, జోష్‌ హేజిల్‌వుడ్, ప్యాట్‌ కమ్మిన్స్ సహా మరికొందరు.. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో కొన్ని మ్యాచులకు దూరం..

Published : 23 Feb 2022 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్, జోష్‌ హేజిల్‌వుడ్, ప్యాట్‌ కమ్మిన్స్ సహా మరికొందరు.. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌)లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు.! ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టులో వీళ్లంతా సభ్యులుగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రారంభ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటకీ.. మార్చి ఆఖరులో లీగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది! 

ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు మార్చి 4 - 25 వరకు టెస్టు సిరీస్‌, మార్చి 29 - ఏప్రిల్‌ 2 మధ్య వన్డే సిరీస్‌, ఏప్రిల్ 5న ఓ టీ20 మ్యాచ్‌ జరుగనుంది. డేవిడ్‌ వార్నర్, జోష్‌ హేజిల్‌వుడ్, ప్యాట్‌ కమ్మిన్స్‌.. టెస్టు సిరీస్‌లో ఆడనున్నారు. ఆ తర్వాత జరుగనున్న వన్డే సిరీస్‌లో కూడా వీరికి చోటు దక్కినా ఐపీఎల్‌లో ఆడటం కోసం పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు, ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పేసర్లు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ వంటి ఆటగాళ్లు కూడా వన్డే, టీ20 జట్టులో భాగంగా ఉన్నారు. అయితే, నిబంధనల ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్‌ ముగిసే వరకు మరే టోర్నీలో ఆడేందుకు వీలులేదు. దీంతో వీళ్లంతా ఐపీఎల్‌లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. 

‘ఐపీఎల్‌ అంటే నాకెంతో గౌరవముంది. టీ20 క్రికెట్లో భారత్ ముందంజలో ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడటంతో మా ఆటగాళ్లు కూడా మరింత మెరుగవుతున్నారు. అందుకే, ఈ టోర్నీని తక్కువ అంచనా వేయలేం. అయితే, సీఏ నిబంధనల ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ ముగిసే వరకు ఆటగాళ్లను భారత్‌కి పంపలేం’ అని సీఏ సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ జార్జ్‌ బెయిలీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత ఏప్రిల్ 6న ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన వేలంలో డేవిడ్‌ వార్నర్‌ని దిల్లీ క్యాపిటల్స్‌, హేజిల్ వుడ్‌ని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ప్యాట్ కమ్మిన్స్‌ (కేకేఆర్‌) జట్లు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సీఏతో ఒప్పందం కుదుర్చుకోని డేనియల్‌ సామ్స్‌, రిలే మెరెడిత్‌, నాథన్ కోల్టర్ నైల్, టిమ్ డేవిడ్‌ లాంటి ఆటగాళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐపీఎల్‌లో పాల్గొనవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని