IPL - 2022 : దిల్లీ ఆటగాళ్లకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన పాంటింగ్‌.!

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేశాడు. పాత ఆటగాళ్లు.. ఇటీవల కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలని సూచించాడు...

Published : 22 Mar 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేశాడు. పాత ఆటగాళ్లు.. ఇటీవల కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలని సూచించాడు. ఇటీవల తొలి సెషన్‌లో పాల్గొన్న ఆటగాళ్లను ఉద్దేశించి రికీ పాంటింగ్‌ మాట్లాడాడు. ఆ వీడియోను దిల్లీ యాజమాన్యం ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.  

‘కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, అన్రిచ్‌ నార్జ్‌, అక్షర్‌ పటేల్‌.. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్ల బాధ్యతను తీసుకోవాలి. బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా కొత్త ఆటగాళ్లను వెంట తీసుకెళ్లాలి. వారికి అందుబాటులో ఉండేలా.. ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచాలి. ఓ కోచ్‌గా, సీనియర్‌ ఆటగాడిగా జట్టులోని యువ ఆటగాళ్లను చేరదీస్తే.. వాళ్లు మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తారు. కెప్టెన్‌గా రిషభ్‌ పంత్ ఎప్పుడూ ఆటగాళ్లకు అందుబాటులో ఉండాల్సిందే. అతడితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా బాధ్యతలు పంచుకుంటే బాగుంటుంది’ అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. కెప్టెన్ రిషభ్‌ పంత్‌, ఓపెనర్ పృథ్వీ షా, స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్, పేసర్‌ అన్రిచ్‌ నార్జ్‌లను దిల్లీ యాజమాన్యం వేలానికి ముందే రిటెయిన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.   

డేవిడ్‌ వార్నర్‌, మిచెల్ మార్ష్‌, టిమ్‌ సీఫర్ట్‌, రోమన్‌ పాలెవ్‌ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు.. విక్కీ ఓత్స్వాల్‌, చేతన్‌ సకారియా, యశ్ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కమలేశ్ నాగర్‌ కోటి వంటి యువ ఆటగాళ్లను కూడా దిల్లీ యాజమాన్యం వేలంలో దక్కించుకుంది. మార్చి 27న ముంబయి ఇండియన్స్‌తో జరుగనున్న మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది.  
  
* ఆయనను ఎప్పుడు కలిసినా ప్రత్యేకమే : రిషభ్‌ పంత్‌

‘మా కోచ్‌ రికీ పాంటింగ్‌ను ఎప్పుడూ కలిసినా.. చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సొంత కుటుంబ సభ్యులను కలిశామన్న భావన కలుగుతుంది. మైదానంలో ఆటగాళ్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ప్రస్తుత నెట్ సెషన్స్‌లో జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో మాట్లాడాం. వారిని మైదానంలో ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి చర్చించాం. ఈ సారి మా జట్టులో భారీ మార్పులు వచ్చాయి. ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఆటగాడిని గమనించాను. మా ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో ఉన్నారు. కొత్త ఆటగాళ్లు కూడా జట్టులో కలిసిపోయారు’ అని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చెప్పాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని