Ashutosh Sharma: అది నా డ్రీమ్‌ సిక్స్.. బుమ్రా బౌలింగ్‌లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ

క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్‌ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్‌ శర్మకూ ఎదురైంది.

Published : 19 Apr 2024 16:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి చేతిలో పంజాబ్‌ కేవలం 9 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. ఒక దశలో భారీ ఓటమి తప్పదనుకున్నపుడు పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ (61) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ముంబయి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కట్టుదిట్టమైన బంతులతో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, అతడి బౌలింగ్‌లోనే అశుతోష్ (Ashutosh Sharma) స్వీప్‌ సిక్స్‌ కొట్టాడు. బుమ్రా వంటి పేసర్ బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌తో బౌండరీ కొట్టడం ఎప్పటికీ మరిచిపోలేనని తాజాగా అశుతోష్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘జస్‌ప్రీత్ బౌలింగ్‌లో ఎప్పటికైనా స్వీప్ షాట్ కొట్టాలని కలలు కంటూ ఉండేవాడిని. దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశా. క్రికెట్‌లో ఇలాంటి లక్ష్యాలు సహజమే. చివరికి ఆ కల ఇప్పటికి నెరవేరింది. నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు మా జట్టు గెలుస్తుందనే నమ్మకం ఉంది. చివరివరకూ పోరాడాం. కొద్దిలో విజయం చేజారింది. అయితే, మా ఆటతీరు మాత్రం దూకుడుగానే కొనసాగిస్తాం. పంజాబ్ క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్ సంజయ్‌ బంగర్ చెప్పిన మాటలే నాలో స్ఫూర్తినింపాయి. ‘నువ్వేమీ బంతిపై నియంత్రణ లేకుండా షాట్లు కొట్టే రకం కాదు. అద్భుతమైన షాట్లు ఆడతావు. అలాంటి వాటిపై దృష్టిపెట్టు’’ అని అన్నాడు. చూడటానికి చిన్న స్టేట్‌మెంటే. కానీ, నా ఆత్మవిశ్వాసం పెంచిందనడంలో సందేహం లేదు. ఆటతీరులోనూ చాలా మార్పులు తెచ్చింది. ఇప్పుడు దానిని అనుసరించడానికే ప్రయత్నిస్తున్నా. సక్సెస్‌ అవుతున్నా’’ అని అశుతోష్‌ తెలిపాడు.

ముంబయిపై కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసిన అశుతోష్ ఏడు సిక్స్‌లు కొట్టాడు. రెండు ఫోర్లు రాబట్టాడు. మొత్తం 50 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. అయితే, బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో లెగ్‌సైడ్‌ కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్. బుమ్రా యార్కర్‌గా వేద్దామని ప్రయత్నించగా.. అశుతోష్‌ ఫుల్‌షాట్‌తో స్టాండ్స్‌లో పడేలా చేశాడు. అది ఫ్రీ హిట్‌ కావడంతో బంతి వికెట్ల మీద కొచ్చినా స్వేచ్ఛగా ఆడేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు