Team India: ఐపీఎల్‌ కంటే వరల్డ్‌ కప్‌ గెలవడం చాలా ముఖ్యం.. ఎందుకంటే?: గంభీర్‌

ఈ ఏడాది భారత (Team India) క్రికెట్ షెడ్యూల్‌ ఫుల్‌ బిజీగా ఉండనుంది. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లతోపాటు ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలను తలపడాల్సి ఉంటుంది. అలాగే భారత క్రికెటర్లు ఐపీఎల్‌లోనూ (IPL 2023) ఆడతారు.

Published : 04 Jan 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ - 2023 టోర్నమెంట్‌కు భారత్‌ అతిథ్యం ఇవ్వనుంది. పన్నెండేళ్ల తర్వాత మరోసారి కప్‌ను అందుకోవాలనే కలను నెరవేర్చుకోవాలని టీమ్‌ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. దీని కోసం తుది జట్టుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దాదాపు రెండున్నర నెలలపాటు ఐపీఎల్‌ జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ కంటే భారత్‌ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ కోసం సన్నద్ధత కోసం కీలక ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించకపోయినా ఫ్రాంచైజీలు బాధపడకూడదని చెప్పాడు. ప్రపంచకప్‌ కంటే ఏదీ ముఖ్యమైంది కాదని స్పష్టం చేశాడు. ‘‘ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023ను దృష్టిలో పెట్టుకొని భారత భవిష్యత్తు పర్యటనల ప్రణాళిక ఉంది. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో పాల్గొనే టాప్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి జాతీయ క్రికెట్‌ అకాడమీ పర్యవేక్షించాలి’’ అని అన్నారు.

ఈసారి వాళ్లు ఆడకపోతే నష్టం లేదు

‘‘2023లో మాత్రం భారత క్రికెట్‌ ప్రధాన లక్ష్యం వన్డే ప్రపంచ కప్‌ టోర్నీనే కావాలి. ఈ సందర్భంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కాస్త ఇబ్బంది పడొచ్చు. అయితే అంతిమంగా భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎవరైనా పెద్ద ప్లేయర్‌ ఐపీఎల్‌ను మిస్‌ అయితే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే ఐపీఎల్‌ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. వరల్డ్‌ కప్‌ అనేది నాలుగేళ్లకొకసారి మాత్రమే వస్తుంటుంది. నా వరకైతే ఐపీఎల్‌ టైటిల్‌ను నెగ్గడం కంటే ప్రపంచకప్‌ను సాధించడం చాలా ముఖ్యం. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ జట్టును సిద్ధం చేయాలి. ఎవరికైనా విశ్రాంతి కావాలంటే వారికి టీ20 సిరీస్‌ల నుంచి ఇవ్వాలి. అంతేగానీ వన్డేల నుంచి మాత్రం ఇవ్వకూడదు. మెగా టోర్నీ బరిలోకి దిగే జట్టు సభ్యులు కలిసి ఆడేలా చూడాలి. ఇదే గత రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ చేసిన అతి పెద్ద తప్పిదం. వేర్వేరు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ప్రకటించి ఇబ్బంది పడింది. అత్యుత్తమ తుది జట్టుతో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది..? ప్రపంచకప్‌ సమయంలో కేవలం వారిపైనే దృష్టి పెడితే బాగుంటుంది’’ అని గంభీర్‌ తెలిపాడు. ప్రస్తుతం గంభీర్‌ ఐపీఎల్‌లోని లక్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీకి మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని