WPL 2024 : సగం మ్యాచ్‌లు పూర్తి.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచేదెవరు..?

డబ్ల్యూపీఎల్‌ 2024(WPL 2024) సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లేఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారింది.

Updated : 04 Mar 2024 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2024(WPL 2024) ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు సగం మ్యాచ్‌లు ఆడేశాయి. ఆయా జట్ల ఆటతీరుపై అభిమానులూ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ రేసులో ఎవరు ఉంటారు.. ఎవరు ఇంటిముఖం పడతారనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తం ఐదు జట్లు తలపడే డబ్ల్యూపీఎల్‌లో ఒక్కో టీమ్‌.. ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటికే అన్ని జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడేశాయి. జోరుమీదున్న దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్‌ రేసులో ముందుండగా.. గుజరాత్‌  జెయింట్స్‌ ఇప్పటి వరకూ విజయాల ఖాతా తెరవక ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు..

ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయంటే..

దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals Women) : మెగ్‌ లానింగ్‌ సారథ్యంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తూ ఈ సీజన్‌లో దూసుకెళ్తోంది. ఆడిన నాలుగింట్లో.. మూడు విజయాలతో 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెరుగైన రన్‌రేట్‌ ఉండటం కలిసొచ్చే విషయం. ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు ఈ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఊపును కొనసాగిస్తే.. అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కూ చేరుకోవచ్చు.

ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians Women) : డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి జట్టు కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు నమోదు చేసింది. రన్‌రేట్‌ ప్రభావంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. ఫ్లేఆఫ్స్‌ చేరడం ఖాయమే. రన్‌రేట్‌ మెరుగుపరుచుకుంటే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశమూ ఉంది.

యూపీ వారియర్స్‌(UP Warriorz) : ఆడిన నాలుగింట్లో రెండు విజయాలే నమోదు చేసింది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో గెలవడమే కాకుండా.. ఇతర జట్ల ఫలితాలు తనకు కలిసిరావాలి. రన్‌రేట్‌ ప్లస్‌లో ఉండటమే కొద్దిగా కలిసొచ్చే అంశం.

ఆర్సీబీ(Royal Challengers Bangalore Women) : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అంచనాలు పెంచిన స్మృతి మంధాన జట్టు.. ఆ తర్వాత డీలా పడింది. రెండు వరుస ఓటములతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రన్‌రేట్‌ మైనస్‌లో ఉండటం ప్రతికూలాంశం. మిగతా మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఇతర జట్ల ఫలితాలు కూడా దీని ప్లేఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.

గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants) : గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన గుజరాత్‌ జట్టు పరిస్థితి ఈ సీజన్‌లోనూ అలాగే ఉంది. ఇప్పటి వరకూ ఆడిన నాలుగింట్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతూ.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఈ జట్టు రేసులో నిలవాలంటే.. మిగతా 4 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేయాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు కలిసిరావాలి.

ప్లేఆఫ్స్‌ ఫార్మాట్‌ ఇలా..

పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ ఆడుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడతాయి. ఇందులో విజేత.. ఫైనల్‌లో తలపడుతుంది. మార్చి 15న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుండగా.. 17న ఫైనల్‌ ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు