Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024.. సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. మార్‌క్రమ్‌ స్థానంలో ఆసీస్‌ స్టార్‌ను సారథిగా నియమిస్తూ ప్రకటన వెలువరించింది.

Updated : 04 Mar 2024 16:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మినీ వేలంలో భారీగా వెచ్చించి మరీ సొంతం చేసుకున్న ప్యాట్‌ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రమోషన్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. గత సీజన్‌లో జట్టును నడిపించిన ఐదెన్ మార్‌క్రమ్‌ను బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్‌కు అప్పగించింది. మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ రూ. 20.5 కోట్లకు దక్కించుకుంది. కెప్టెన్‌గా ఆసీస్‌కు టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే ప్రపంచ కప్‌ను అందించిన ఘనత కమిన్స్‌ సొంతం. దీంతో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శనతో రాణించాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కమిన్స్‌ను సారథిగా నియమించింది.

పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌స్టెయిన్‌ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను సన్‌రైజర్స్‌ నియమించింది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనని ఇప్పటికే స్టెయిన్‌ సమాచారం ఇచ్చినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అప్పటి కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్‌ కూడా గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. కొన్ని మ్యాచుల్లో మెరిసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో ఈసారి మార్‌క్రమ్‌ బదులు ప్యాట్‌ కమిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. 

జట్టు ఇదే: 

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్‌ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్విర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్‌ ఫరూఖి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్‌ మార్కండె, ట్రావిస్‌ హెడ్, వనిందు హసరంగ, జయ్‌దేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమన్యన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని