Chahal: జట్టు కూర్పే కీలకం.. ఇది చెస్‌ కాదు: యుజ్వేంద్ర చాహల్‌

‘కుల్చా’ ద్వయం.. కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్ (Chahal). భారత స్పిన్‌ ద్వయం ఇటీవల కాలంలో ఒకరు ఆడితే.. మరొకరు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇదే విషయంపై విండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌ సందర్భంగా చాహల్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

Updated : 06 Aug 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌లో మణికట్టు మాంత్రికుడిగా పేరొందిన యుజ్వేంద్ర చాహల్‌కు (Chahal) ఇటీవల అవకాశాలు మాత్రం తక్కువగా వస్తున్నాయి. టీమ్‌ఇండియాతోపాటు (Team India) ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. వివిధ సమీకరణాల కారణంగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్నాడు. తాజాగా విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ (WI vs IND) ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. అయితే, టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. మూడు ఓవర్లు వేసి కీలకమైన ఓపెనర్ల వికెట్లను పడగొట్టిన చాహల్‌ తన సత్తా చాటాడు. ఇవాళ విండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో చాహల్‌ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. క్రికెట్‌ అంటేనే జట్టుగా ఆడాల్సి ఉంటుందని, చెస్‌ మాదిరిగా ఒకరే ఆడరని పేర్కొన్నాడు. 

‘‘జట్టు కూర్పు మా తొలి ప్రాధాన్యం. ఇందులో కొత్తేమీ లేదు. లోయర్‌ ఆర్డర్‌లో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా లేదా అక్షర్‌ పటేల్ వస్తారు. ఒకవేళ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలంటే పిచ్‌ పరిస్థితి అందుకు తగ్గట్టుగానే ఉండాలి. కుల్‌దీప్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్నాడు. దీంతో అతడికి అవకాశాలు ఇస్తూ టీమ్‌ఇండియా మద్దతుగా నిలిచింది. ఇక నేను ఎప్పుడు అవకాశం వచ్చినా నా సత్తా ఏంటో చూపించడానికి ప్రయత్నిస్తుంటా. అంతేకానీ, ఖాళీగా మాత్రం ఉండను. నా ప్రాక్టీస్‌ నేను చేస్తుంటా.  

ఈ నాలుగే సెమీస్‌కు.. టీమ్‌ఇండియాలో ఆ సీనియర్‌ ఉండాల్సిందే

మేము ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. దాదాపు రెండునెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. మొన్న ఐపీఎల్‌లో ఆడా. అదంతా నా సన్నద్ధతకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఇదేమీ వ్యక్తిగతంగా ఆడే క్రీడ కాదు. జట్టు కోసం ఆడేందుకే ఇక్కడ ఉన్నాం. ఎవరైనా ఆటగాడు ఓ రెండు సిరీస్‌లకు ఎంపికై పక్కన కూర్చుంటే.. అతడు జట్టు నుంచి దూరం అయినట్లు కాదు. నేను మాత్రం సంతోషంగా ఉన్నా. నేనేమీ ఇంటి దగ్గర కూర్చోవడం లేదు. జట్టుతోపాటే ప్రయాణిస్తున్నా. జట్టులోనే భాగమై ఉంటున్నా. నేను చదరంగం ఆడాను. కానీ, అది వ్యక్తిగత గేమ్. క్రికెట్‌ మాత్రం జట్టుగా ఆడే ఆట. జట్టులోని 15 మందిలో 11 మంది మాత్రమే బరిలోకి దిగుతారు. నేను ఆడినప్పుడు కుల్‌దీప్‌కు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అతడు ఆడుతున్నాడు. తుది జట్టులో లేకుండా రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్నప్పటికీ భారత జెర్సీ వేసుకునే ఉంటాను కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నా. నలుగురి కెప్టెన్సీలో ఆడటం ఆనందంగా ఉంది. మేమంతా ఒకే కుటుంబం ఉంటాం. అందులో ధోనీ పెద్దన్న కాగా.. తర్వాత విరాట్, రోహిత్ వచ్చారు. ఇప్పుడు హార్దిక్‌ నాయకత్వంలో ఆడుతున్నా’’ అని చాహల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు