గ్రహాల పుట్టుక గుట్టు ఇదేనా?

రెండు భారీ గ్రహాలు ఢీకొంటే? అప్పుడు ప్రకాశవంతమైన కాంతి వెలువడితే? అలాంటి దృశ్యాన్నే శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ఈ గ్రహాలు ఢీకొన్న తర్వాత వెలువడిన శకలాలు క్రమంగా చల్లారి, కొత్త గ్రహంగా ఏర్పడే అవకాశం లేకపోలేదు.

Updated : 18 Oct 2023 00:39 IST

రెండు భారీ గ్రహాలు ఢీకొంటే? అప్పుడు ప్రకాశవంతమైన కాంతి వెలువడితే? అలాంటి దృశ్యాన్నే శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు. ఈ గ్రహాలు ఢీకొన్న తర్వాత వెలువడిన శకలాలు క్రమంగా చల్లారి, కొత్త గ్రహంగా ఏర్పడే అవకాశం లేకపోలేదు. అదే నిజమైతే కొత్త ప్రపంచం ఏర్పడటాన్ని ప్రత్యక్షంగా చూసినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహాలు ఏర్పడే తీరును అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుందనీ ఆశిస్తున్నారు.

అది డిసెంబరు, 2021. ఖగోళ శాస్త్రవేత్తలు సుదూర నక్షత్ర వ్యవస్థలో సూర్యుడి లాంటి ఒక నక్షత్రాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సుమారు 1,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దాని పేరు ఏఎస్‌ఏఎస్‌ఎస్‌ఎన్‌-21క్యూజే. అప్పుడది పేలటానికి సిద్ధంగా ఉంది. కొద్ది నెలల వరకూ దాన్నుంచి వెలువడే కాంతి మారుతూ వచ్చింది. మునుపటి ప్రకాశానికి చేరుకున్నాక పూర్తిగా కనుమరుగైంది. దీన్ని నాసాకు చెందిన వైస్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గుర్తించింది. ఇలాంటి మసక నక్షత్రాలు కొత్తేమీ కాదు. భూమికి, నక్షత్రానికి మధ్యలోంచి వెళ్లే పదార్థం మూలంగా కాంతి తగ్గినట్టు కనిపిస్తుందని భావిస్తుంటారు. ఏఎస్‌ఏఎస్‌ఎస్‌ఎన్‌-21క్యూజే కూడా ఇలాంటిదేనని భావించారు. కానీ కనుమరుగు కావటానికి ముందు అక్కడి నుంచి వెలువడే పరారుణ కాంతి సుమారు 4% వరకు పెరగటం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే కొన్ని వేల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతతో కూడిన వస్తువు నుంచే ఇలాంటి బలమైన పరారుణ కాంతి వెలువడుతుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే- రెండు భారీ గ్రహాలు ఢీకొనటమే కారణమని తేలింది. దీని ప్రభావంతో అసలు గ్రహాల కన్నా వందలాది రెట్ల ఎక్కువ పరిమాణంలో వేడి, ప్రకాశవంత పదార్థం ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి పరారుణ కాంతికి ఇదే కారణం. అయితే వైస్‌ టెలిస్కోప్‌ ప్రతి 300 రోజులకు ఒకసారే నక్షత్రాన్ని పరిశీలిస్తుంది. అందువల్ల తొలిదశలో కాంతిని గుర్తించకపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. మన సౌర వ్యవస్థలో ఇలాంటి భారీ తాకిడి మూలంగానే యురేనస్‌ గ్రహం ఒకవైపునకు వంగటం, బుధుడి అత్యధిక సాంద్రత, మన చంద్రుడు పుట్టుకు రావటం వంటి పరిణమాలు సంభవించాయి. అందుకే దీనికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. విస్ఫోటం మూలంగా విస్తరించిన పదార్థం చల్లబడి, సంకోచించి కొత్త గ్రహంగా ఏర్పడటానికి లక్షలాది ఏళ్లు పడుతుంది. కాబట్టి గ్రహాలు ఏర్పడే కీలక విధానమూ దీని ద్వారా తెలియగలదని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని