Updated : 30 Nov 2021 05:25 IST

CM KCR: యాసంగిలో కొనలేం

కేంద్రం ధాన్యం తీసుకోనని తేల్చిచెప్పింది..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు
కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం
750 మందిని పొట్టన పెట్టుకుంది
వరి వేసి రైతులు ఆగం కావద్దు
కిషన్‌రెడ్డి దద్దమ్మలా మాట్లాడారు
ముఖ్యమంత్రి కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌


రైతుల ఉసురు పోసుకోవడానికి కేంద్రం కరెంటు చట్టం తెచ్చింది. బోర్లకు మీటర్లు పెట్టాలంటోంది. రైతు మెడపై కత్తి పెడతానంటోంది. లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్‌ చేస్తదట. కేంద్రమే విద్యుత్‌ మీద పెత్తనం చేస్తదట. అప్పుడు 24 గంటల కరెంటు వద్దంటరు. అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతాదా? రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే భాజపా ప్రభుత్వం పోవాలి

రైతుల తరఫున మంత్రులు, ఎంపీలు, సీఎస్‌ దిల్లీ వెళ్తే ‘మీకు వేరే పనిలేదా?’ అని కేంద్రమంత్రి (పీయూష్‌ గోయల్‌) అన్నారు. మంత్రులకు పనిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్రమంత్రి మాట్లాడేది? రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా? తెలంగాణ రైతులను ముంచడానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్తాడు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలి.

దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నది కేంద్రం. ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల కంటే వెనకపడ్డాం. దేశంలో అప్పులు పెంచింది భాజపా. రూ. 80 లక్షల కోట్ల అప్పులు చేసింది. పాత అప్పులు రూ. 50 లక్షల కోట్లు ఉన్నాయి.  

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


కేంద్రం చేతులెత్తేసి.. ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతులు వరి వేసి ఆగం కావద్దని స్పష్టం చేశారు. వారికి రైతుబంధు మాత్రం కొనసాగుతుందని చెప్పారు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని, కేంద్రం తీసుకోకుంటే ఆ పంటను ప్రధాని, కిషన్‌రెడ్డి ఇళ్ల ముందు, భాజపా కార్యాలయాలు, ఇండియా గేట్‌ వద్ద పోస్తామన్నారు. కేంద్రంలో దుర్మార్గపు, రైతు వ్యతిరేక, హంతక, రాబందు ప్రభుత్వం ఉందని, 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని, పూర్తిగా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇంత దిగజారిన, నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు. ధాన్యాన్ని సేకరించబోమంటూ కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని.. రైతాంగాన్ని గందరగోళపరుస్తోందని విరుచుకుపడ్డారు. దేశంలో రైతులు బాగుపడాలంటే భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ధాన్యం కొనాలని ఒప్పించే ధైర్యం లేక ఇక్కడ అసత్యాలు చెబుతూ చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో బహిరంగ చర్చకు రావాలన్నారు. సోమవారం మంత్రిమండలి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు ఆహారం లేక చస్తుంటే.. నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. నిజంగా నిల్వలు అధికంగా ఉంటే ప్రజలకు వాటిని ఉచితంగా పంపిణీ చేయాలి’ అని సూచించారు.

దిక్కుమాలిన మాటలు
‘‘దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. దేశ ఆహార భద్రత కేంద్రం బాధ్యత. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. కానీ.. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతుల ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తోంది. ఇది మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం. తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం. ఇది రైతు వ్యతిరేక పార్టీ. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో భాజపా కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగు. ఎన్నో రైతు సంక్షేమ విధానాలు అమలు చేస్తున్నాం. మా చేతుల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ రైతులకు అందజేస్తం. తెలంగాణ రైతు బీమా పథకం మరెక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తున్నందున కేంద్రం ఓర్వడం లేదు. ధాన్యం కొంటారా.. కొనరా.. అంటే అది చెప్పకుండా భాజపా వాళ్లు ఏమేమో చెబుతున్నారు. మేం వడ్లు కొనం.. అయినా కల్లాల కాడ కొట్లాడుతాం అంటరు.. పనికిమాలిన చట్టాలు చేసేది. వాపసు తీసుకునేది భాజపాయే. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సిగ్గులేకుండా మాట్లాడతారు. భాజపా వాళ్లకు పాలించడం చేతకాదు. మీ చేతగానితనాన్ని రాష్ట్రంపై రుద్దుతారా? మేం భాజపాలాగా చిల్లర రాజకీయాలు చేయడంలేదు. తెలంగాణలో యాసంగిలో వాతావరణం వల్ల ఉప్పుడు బియ్యమే వస్తాయి. మామూలుగా వర్షాకాలంలో పండే బియ్యం 67 కిలోలు వస్తే.. యాసంగిలో పండే పంటకు బియ్యం 35 కిలోలే వస్తది. ఆ నష్టం ఎవరు భరించాలి? బాయిల్‌ చేసి అమ్మితే కరెక్ట్‌గా వస్తుంది. అందుకే పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులు వచ్చాయి. గత సంవత్సరం దాకా తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక గింజ కూడా తీసుకోం అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? కేంద్రం చేతులెత్తేసింది.. గత యాసంగి ధాన్యమే పూర్తిగా తీసుకోలేదు. అప్పుడు రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సొంత వినియోగానికి, విత్తన కంపెనీలతో ఒప్పందం ఏదైనా ఉంటే వరి సాగు చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి కొనుగోలు చేయదు.

ఉన్మాదిలా మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉప్పుడు బియ్యం కొంటారా? కొనరా? చెప్పమంటే చెప్పరట. వర్షాకాలం ఎంత తీసుకుంటారో చెప్పమంటే చెప్పరట. ఈ ఉల్టాపల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని అంటున్నారు. చాతకాని దద్దమ్మ. అయామ్‌ వెరీ సారీ. ఆయన ఏం మాట్లాడుతున్నరు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నరు. మీకు దమ్ముంటే తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనిపించాలి. తెలంగాణలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. 35 డిగ్రీల్లో ఎండల్లో పండుతాది మా పంట.. మీ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. మీ ప్రధానే క్షమాపణలు చెప్పారు రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ మీది.. మీరు మాట్లాడతారా? మీది రైతు రాబందుల పార్టీ.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పక్కన మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు

మేం రైతుబంధువులం
మేం రైతుబంధువులం. కొత్త రాష్ట్రమైనా.. కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. ఏపీ ఇబ్బంది పెట్టినా, కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించాం. ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగింది. మా హయాంలో 69.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. నాశనమైన చెరువులను బాగు చేశాం. ప్రాజెక్టులు కట్టాం. ఆయకట్టు స్థిరీకరణ చేశాం. పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇవన్నీ కనపడలేదా? ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ప్రాజెక్టు, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌, దేవాదుల ఎవరు పూర్తి చేశారో అందరికీ తెలుసు. ఏడేళ్ల క్రితం మూడెకరాల రైతు పరిస్థితి ఏమిటి. ఈరోజు ఏమిటి? రాష్ట్రం వస్తే ధరలు పడిపోతాయి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు 20 లక్షల్లోపు భూములే దొరకడంలేదు. రోడ్డు ఉంటే ఎకరా రూ. 30, 40 50 లక్షలు, జాతీయ రహదారి వెంట రూ.3 కోట్ల ధర పలుకుతున్నాయి. అయిదెకరాలున్న తెలంగాణ రైతు కోటీశ్వరుడు.. ఏడేళ్ల క్రితం బిచ్చగాడు.. ఇప్పుడు తెలంగాణ రైతులు కాలర్‌ ఎగరేసి ప్రకాశం, కర్ణాటకలో భూములు కొంటున్నారు.

విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తాం
విద్యుత్‌ బిల్లుపై రైతాంగానికి ముప్పు ఉంది. బోర్ల వద్ద మీటర్లు పెట్టాలంటున్నారు. లేకపోతే నిధులివ్వబోమంటున్నారు. విద్యుత్‌పై పెత్తనం వస్తే ఉచిత విద్యుత్‌ను తీసేయమంటారు. ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. మేం ఎస్సీ వర్గీకరణ బిల్లు పంపితే పెండింగ్‌లో పెట్టారు. యూపీ ఎన్నికల కోసం దళిత్‌ అంటున్నారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్లను పెంచాలన్నా వినడం లేదు. వీటన్నింటిపై పార్లమెంటులో అడుగడుక్కీ కేంద్రాన్ని నిలదీస్తాం.

రైతులకు రూ. 27.50 కోట్ల సాయం
రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామన్నా.. రూ. 27.50 కోట్ల ఆర్థికసాయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. నేను, మంత్రులు వెళ్లి రైతు కుటుంబాలకు అందజేస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.


దేశానికి ఏం ఒరగబెట్టారు?

డేళ్లలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీసీలు, దళితులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఏం చేశారు? ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమిటి? వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతారు. దేశంలో పెట్రో ధరలు పెంచిందెవరు? నరేంద్రమోదీ ప్రభుత్వం కాదా? క్రూడాయిల్‌ ధర అప్పుడెంత? ఇప్పుడెంత? ధర తగ్గినా అబద్ధాలు చెప్పి, దేశాన్ని మోసం చేసి డీజిల్‌ ధరలు పెంచుతున్నారు. పెంచిన తదుపరి రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించాలని ధర్నాలు చేస్తారా? ఏమైనా సిగ్గుందా? ప్రజలు అమాయకులా? మీరేమో పెంచాలే.. మేం తగ్గియ్యాల్నా? ఇది నీతా? దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం చేసే గొప్పతనమా ఇది.. ఇదేం దందా.  కచ్చితంగా  వీరు ముంచేటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు కాదని తేలిపోయింది. మతపిచ్చితో విభజన రాజకీయాలు.. దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఐటీ, పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్థికంగా బలంగా తయారవుతోంది. ఇండియాటుడే రేటింగ్‌లో నంబర్‌ 1గా నిలిచింది.. మతాల మధ్య పంచాయితీ, మతకల్లోలాలు పెట్టి, కర్ఫ్యూ ఫైరింగ్‌లు పెడితే మంచిదా? భాజపాది అదే ధోరణి, దానిని ప్రజలు అంగీకరిస్తారా? విభజన పార్టీయా దేశానికి కావాల్సింది?

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


సాగులో ఇంత సాధించాం

* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున వరి ధాన్యం సేకరణ 10.09 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా సగటున 69.38 లక్షల టన్నుల సేకరణ జరిగింది. 2020-21 సీజన్‌లో 141.08 లక్షల టన్నులను సేకరించాం.

* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున 37.47 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగయింది. రాష్ట్రం వచ్చాక గత ఏడేళ్ల కాలంలో సగటున 55.28 లక్షల ఎకరాల్లో వరి పండింది. 2020-21లో అత్యధికంగా 104.23 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.


 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని