ప్రాంతానికో సెల్‌ఫోన్‌.. రాష్ట్రానికో నంబరు ప్లేటు

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాపై నిఘా విస్తృతం కావడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.

Published : 27 Nov 2021 03:52 IST

గంజాయి ముఠాల ఎత్తుగడలు

సమాన వాటా ఇచ్చేలా డ్రైవర్లతో ఒప్పందాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాపై నిఘా విస్తృతం కావడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. దర్యాప్తు బృందాల కంట పడకుండా  గమ్యానికి చేరుకునే లారీ డ్రైవర్లకు భారీగా నజరానాలు ప్రకటించడం..  ప్రాంతానికో సెల్‌ఫోన్‌, నంబరు ప్లేటు వాడటం, సొంత చెక్‌పోస్టుల ఏర్పాటు వంటి అనేక వ్యూహాలు అనుసరిస్తున్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు 1820 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠా రాచకొండ ఎస్‌వోటీ బృందానికి రెండు రోజుల క్రితం చిక్కింది. విచారణలో ముఠా కార్యకలాపాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పట్టుకునేందుకు అవకాశం ఉండటంతో డ్రైవర్లు, సహా ముఠా సభ్యులు ఫోన్‌ నంబర్లను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారని గుర్తించారు. సీలేరులో గంజాయి నింపుకోగానే అప్పటివరకు మాట్లాడిన ఫోన్‌లను అక్కడే పడేస్తున్నట్టు, విశాఖ వరకు మరొకటి, ఆ తర్వాత హైదరాబాద్‌ శివార్ల వరకు ఇంకోఫోన్‌ను వినియోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, దిల్లీ వాహనాలు

రవాణాకు వినియోగించే వాహనాల విషయంలోనూ స్మగ్లర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలనే వినియోగిస్తున్నారు. వాటికి నకిలీ నంబరు ప్లేట్లను తగిలిస్తున్నారు. ఏపీ దాటే వరకు ఆ రాష్ట్రానిది, తెలంగాణలోకొచ్చాక ఇక్కడిది బిగిస్తున్నారు. ‘తాజాగా 1820 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడిన లారీ పశ్చిమబెంగాల్‌కు చెందినదని, దానికి ఏపీ నంబరు ప్లేటు  వాడినట్లు గుర్తించామని’ గంజాయి నియంత్రణ కేసుల్ని పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. ‘ఈ ముఠాలోని మిగిలిన సభ్యులంతా మహారాష్ట్రకు చెందిన వారే. డ్రైవర్‌ రషీదుల్‌ మాత్రం పశ్చిమబెంగాల్‌ వాసి. ఏవోబీ నుంచి తరచూ గంజాయిని తరలించే ఇతడికి ముఠాసభ్యులు భారీ నజరానా ప్రకటించినట్లు దర్యాప్తులో తేలింది. సాధారణంగా ఏవోబీ నుంచే దేశంలోని 14 రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది. ఇందుకుగానూ లారీల డ్రైవర్లకు ట్రిప్పు ఒక్కింటికి రూ.50వేల వరకు ముట్టజెబుతారు. దూరం పెరిగితే మరింత ఎక్కువ ఇస్తారు. ఉస్మానాబాద్‌ ట్రిప్పులో మాత్రం రషీదుల్‌కు విక్రయించిన అనంతరం వచ్చిన లాభాల్లో సమాన వాటా ఇస్తానని ఆశ చూపారు’ అని ఆయన వెల్లడించారు.


సొంతంగా 3 చెక్‌పోస్టులు

కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసుల కళ్లు గప్పేందుకు స్మగ్లర్లు సూర్యాపేట, పంతంగి, అబ్దుల్లాపూర్‌మెట్‌లలో మూడు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడున్న తమ సంబంధీకులు అనుమతి ఇస్తేనే వాహనాన్ని ముందుకు కదిలించేలా డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా మరమ్మతుల పేరిట పక్కన ఆపేస్తున్నారు. ‘‘పటాన్‌చెరు దాటితే గంజాయి తరలింపు ముఠాలను పట్టుకోవడం సాధ్యం కాదు. అక్కడి నుంచి లోడ్‌తో ఉన్న వాహనాలు అసలు సూత్రధారుల చేతుల్లోకి వెళ్తాయి. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా పంతంగి నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు డేగకళ్లతో జల్లెడ పడుతున్నామని’ ఓ దర్యాప్తు అధికారి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు