Yadadri: అంగరంగ వైభవం.. అంకురార్పణం

అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశేష పర్వానికి అంకురార్పణం ఘనంగా జరిగింది. ఓ వైపు గలగలా గోదారి గండి చెరువుకు తరలిరాగా.. అత్యద్భుతంగా పునర్‌ నిర్మించిన యాదాద్రి ఆలయంలో స్వయంభువుల దర్శనానికి కీలకమైన మహాకుంభ

Updated : 22 Mar 2022 12:44 IST

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వానికి ఘనంగా మొదలైన క్రతువులు

ప్రధానార్చకుల పర్యవేక్షణలో 108 మంది రుత్వికులతో శ్రీకారం

నేడు ప్రారంభంకానున్న పంచకుండాత్మక మహాయాగం

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశేష పర్వానికి అంకురార్పణం ఘనంగా జరిగింది. ఓ వైపు గలగలా గోదారి గండి చెరువుకు తరలిరాగా.. అత్యద్భుతంగా పునర్‌ నిర్మించిన యాదాద్రి ఆలయంలో స్వయంభువుల దర్శనానికి కీలకమైన మహాకుంభ సంప్రోక్షణలో ఆదిపర్వాలు సోమవారం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. ఆలయ ఉద్ఘాటన పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక యాగానికి ముందస్తుగా మహావిష్ణువు సర్వసేనాని అయిన విష్వక్సేన ఆళ్వారుడికి తొలిపూజ చేపట్టి బాలాలయంలో అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు స్వయంభువులు కొలువై ఉన్న ప్రధానాలయంలో వాస్తుదోష నివారణ, సుదర్శన హోమాది క్రతువులు చేపట్టారు. అనంతరం దివ్య విమానంపై ప్రతిష్ఠించనున్న శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి ప్రత్యేక పూజలు చేపట్టి మూలవరుల అనుమతి పొందారు. ఈ నెల 28 నుంచి మూలవరుల దర్శనాలకు తెరతీయనున్న నేపథ్యంలో ప్రధానాలయం ముఖమంటపంలోని ఉప ఆలయాల్లో మూర్తుల ప్రతిష్ఠ పర్వానికి పూజలు జరిపారు. అనంతరం బాలాలయంలో ఉదయం స్వస్తివచనం, రాత్రి అంకురార్పణ కైంకర్యాలను కొనసాగించారు. విష్వక్సేన ఆరాధనలో అగ్నిపూజ చేపట్టి జలాన్ని పూజించారు. ఆ నీటితో ఆలయ ప్రాంగణంతోపాటు యాగశాలను శుద్ధి చేశారు. స్వామి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా వేకువజామున బాలాలయంలో శ్రీ స్వామి ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేకం నిర్వహించారు. ఈ క్రతువులన్నీ ఆలయ ప్రధానార్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహచార్య పర్యవేక్షణలో పాంచరాత్ర ఆగమ విధానాలతో కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు యాత్రికులను ఆహ్వానిస్తూ కొండ కింద స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కేంద్రాలను నెలకొల్పారు.

 యాగ పూజలు..

వారం పాటూ కొనసాగే పంచకుండాత్మక యాగ నిర్వహణకు బాలాలయంలో ఏర్పాటుచేసిన యాగశాలలో సంప్రోక్షణ పర్వాన్ని చేపట్టి కుండాలను సిద్ధం చేశారు. నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీమహాలక్ష్మి కుండంలో నిర్వహించే యాగానికి సంబంధించి పర్యవేక్షకులకు బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పారాయణ పఠనానికి 108 మంది రుత్వికులు సంసిద్ధులయ్యారు. మంగళవారం మొదలయ్యే పంచకుండాత్మక మహాయాగం నిర్వహణకు యాగశాలను సిద్ధం చేసి ద్రవ్యాలను చేర్చారు. శాంతిపాఠం, అవధారయాల పర్వాల్లో ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, ద్వారతోరణం క్రతువులు చేపట్టాక అగ్నిప్రతిష్ఠ, అగ్ని మథనంతో యాగం మొదలుకానుంది.

 శివాలయ ఉద్ఘాటనకు యంత్రజపం

వచ్చే నెల 25న క్షేత్రంలోని పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన జరగనున్న నేపథ్యంలో సోమవారం యంత్ర జపం నిర్వహించారు. రాంపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సూచనలతో ఉద్ఘాటన పర్వానికి ముందస్తు కైంకర్యాలను చరమూర్తుల మందిరం(తాత్కాలిక ఆలయం)లో 13 మంది పూజారులు, వేదపండితులు, పురోహితులతో కొనసాగించారు.


గలగలా గోదారి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ నుంచి యాదాద్రి క్షేత్రానికి మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేయగా.. సోమవారం సాయంత్రం గండిచెరువుకు చేరుకున్నాయి. దీంతో గోదావరి జలాలను క్షేత్రానికి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరినట్లైంది. గండిచెరువు నిండిన తర్వాత అక్కడి నుంచి కొండ కింద లక్ష్మి పుష్కరిణి, కొండపైనున్న విష్ణు పుష్కరిణిలకు జలాలను తరలిస్తారు. ప్రభుత్వ పక్షాన స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత గోదావరి జలాలతో కూడిన బిందెను తీసుకొచ్చి పూజారులకు అప్పగించారు. మహాక్రతువు ప్రారంభం కావడంతో భద్రతా ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని