రాష్ట్రంలోకి యూకే వైరస్‌?

ప్రపంచ దేశాలను  బెంబేలెత్తిస్తోన్న యూకే వైరస్‌ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో.. కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్‌ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమీ లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు

Updated : 29 Dec 2020 11:55 IST

 వరంగల్‌ నగర జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో గుర్తింపు!
  బాధితుని తల్లికి కొవిడ్‌ పాజిటివ్‌
  ఆమె నమూనాలూ సీసీఎంబీకి తరలింపు
 నిలకడగానే ఇరువురి ఆరోగ్యం
 అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

ఈనాడు- హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను  బెంబేలెత్తిస్తోన్న యూకే వైరస్‌ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తిలో.. కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా సీసీఎంబీ నిర్ధారించినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. అలాగే యూకే వైరస్‌ ప్రవేశంపై దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అధికారిక ప్రకటనలేమీ లేవు. వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో పరీక్షలు కొనసాగుతుండడంతో.. వాటన్నింటి ఫలితాలను సమీకరించి ఒకేసారి కేంద్ర ఆరోగ్యశాఖే వెల్లడించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వరంగల్‌ నగర జిల్లాకు చెందిన వ్యక్తిలో కొత్త రూపు సంతరించుకున్న కొవిడ్‌ సోకినట్లు తెలుస్తోంది. ‘‘ఈ వ్యక్తిలో 16న కొవిడ్‌ లక్షణాలు కనిపించగా, స్థానికంగానే పరీక్షలు చేయించారు. 22న వెల్లడైన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.  అప్పటి నుంచి వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. కరోనా జన్యు పరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో మార్పు చెందిన వైరసూ.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చారు. బాధితుడి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. బాధితుడి భార్య సహా ఇతరులకూ కొవిడ్‌ నెగెటివ్‌ రాగా, తల్లి(71)కి మాత్రం పాజిటివ్‌గా తేలింది. ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె నుంచి నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం సీసీఎంబీకి పంపించారు.
యూకే వైరస్‌ సోకిన వ్యక్తిలో, ఆయన తల్లిలో ఎటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ లేవు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.  మరో 7-10 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతాం. ఇంకో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేయించి, యూకే వైరస్‌ నెగెటివ్‌గా తేలిన అనంతరమే.. ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తాం’’ అని వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రెండు సార్లు నెగెటివ్‌ వస్తేనే...
తాజా నిబంధనల ప్రకారం.. యూకే వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే.. పూర్తిస్థాయిలో ఆ వైరస్‌ ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి వరంగల్‌ కేసుకు సంబంధించి కుమారుడిలో మాత్రమే యూకే వైరస్‌ ఉన్నట్లుగా గుర్తించడంతో.. ఈ విధానం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. తల్లికి సాధారణ కొవిడ్‌ నిబంధనలే వర్తిస్తాయి. ఆ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన ఇతరులకూ మరోసారి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ 2 వారాల పాటు ఇళ్ల వద్ద ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.

నియంత్రణకు కార్యాచరణ

మార్పు చెందిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తొలిదశలోనే అడ్డుకోవడానికి యుద్ధప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ శాఖ కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.


అతి వేగంగా వ్యాప్తి చెందే ముప్పు

కరోనా వైరస్‌ ఇప్పటికే పలుసార్లు మార్పులు చెందగా.. సెప్టెంబరులో ఈ వైరస్‌లో చోటుచేసుకున్న గణనీయమైన పరివర్తనాలు ప్రమాదకరంగా మారినట్లుగా బ్రిటన్‌ గుర్తించింది. శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. యూకేలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇటలీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ విస్తరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కంటే.. ఈ జన్యు మార్పు చెందిన వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.‘ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ వ్యాప్తి 30 శాతం ఉంటే.. ఈ కొత్త రకం వైరస్‌ వ్యాప్తి 40-70 శాతం ఉన్నట్లు తేలింద’ని పేర్కొన్నారు.


ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం
-ఆచార్య డాక్టర్‌ జీకే పరంజ్యోతి, శ్వాసకోశ వ్యాధుల విభాగం అధిపతి, నిమ్స్‌

కరోనా ఆర్‌ఎన్‌ఏ వైరస్‌. ఇది ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంది. కొత్తగా యూకేలో పరివర్తనం చెందిన వైరస్‌కు.. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ కంటే అతి వేగంగా వ్యాప్తి చెందే గుణముంది. దీనివల్ల కేసుల సంఖ్య పెరుగుతుందేమోగానీ.. మరణాల శాతం పెరిగే అవకాశాల్లేవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న టీకాలు కూడా ఈ పరివర్తనం చెందిన వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలవని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గుంపుల్లో తిరగకపోవడం, మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల ఎడం పాటించడం వంటి జాగ్రత్తలు యూకే వైరస్‌ను కూడా దీటుగా ఎదుర్కోవడానికి బాగా అక్కరకొస్తాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని