టెట్‌లో అర్హత సాధిస్తే జీవితకాల గుర్తింపు

ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించారు. టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు

Updated : 24 Mar 2022 13:44 IST

ఇక ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులే
సవరణలతో తాజాగా ఉత్తర్వుల జారీ
సత్వరం పరీక్ష నిర్వహణకు సర్కారు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిని ఆదేశించారు. టెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 2015 డిసెంబరు 23న టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీఓ 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీఓ 8 ఇచ్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు. పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులను భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉన్నాయి. అందులో ఎస్‌జీటీ కొలువులు 6,700 వరకు ఉంటాయి. ఆదర్శ పాఠశాలల ఖాళీలూ కలుపుకొంటే గరిష్ఠంగా 11 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. మే నెలలోనే టెట్‌ నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో ఆ పరీక్ష జరిపారు.

తాజాగా చేసిన మార్పులు...
* ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.
* ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం  ఇప్పుడూ చెల్లుబాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని