TET Exam: డీఈడీ, బీఈడీ ఫైనల్‌ విద్యార్థులూ టెట్‌ రాయొచ్చు

డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-టెట్‌)కు హాజరుకావొచ్చు.

Updated : 26 Mar 2022 05:08 IST

33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పెరిగిన పరీక్ష ఫీజు
జూన్‌ 27న ఫలితాల విడుదల
నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ

ఈనాడు, హైదరాబాద్‌: డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-టెట్‌)కు హాజరుకావొచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమకూ అవకాశం ఇవ్వాలని, కరోనా పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ఆలస్యం కారణంగా తమ చదువు పూర్తికాలేదని అధికారులు, మంత్రులకు విన్నవించారు.ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచార పత్రం( ఇన్‌ఫర్మేషన్‌ బ్రోచర్‌)లో చివరి ఏడాది వారు కూడా హాజరుకావొచ్చని పేర్కొంది. దీనివల్ల సుమారు 25 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. అందులో డీఈడీ విద్యార్థులు 3 వేల మంది వరకు ఉన్నారు. కాకపోతే తర్వాత టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ)నాటికి బీఈడీ/డీఈడీ/పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తయి ఉండాలి. గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారూ టెట్‌-2022కు హాజరై స్కోర్‌ పెంచుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. బీఈడీ అభ్యర్థులకు కూడా ఈసారి పేపర్‌-1 రాసుకునే అవకాశం ఇచ్చినందున దానికి అధిక సంఖ్యలో హాజరుకావొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2017టెట్‌లో పేపర్‌-1కు 88 వేల మందికిపైగా హాజరు కాగా... ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పరీక్ష ఫీజు రూ.100 పెంపు
రాష్ట్రంలో 2017 జులై 23న జరిగిన టెట్‌కు ఒక పేపర్‌ లేదా రెండింటికి కలిపి రూ.200 పరీక్ష ఫీజు ఉండగా ఈసారి దాన్ని రూ.300కు పెంచారు. ఏప్రిల్‌ 12 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నా ఫీజు చెల్లింపు గడువు మాత్రం 11వ తేదీ వరకే ఉంటుంది.

జూన్‌ 6 నుంచి హాల్‌టికెట్లు
*
33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒక పరీక్ష కేంద్ర సామర్థ్యం పూర్తయిన వెంటనే ఆ కేంద్రం పేరు వెబ్‌సైట్లో కనిపించదు. అప్పుడు అభ్యర్థులు మిగిలిన సెంటర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
* జూన్‌ 6 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 12న పరీక్ష జరిగితే అదే నెల 27న ఫలితాలు విడుదల చేస్తారు.
* టెట్‌ ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు(మల్టిపుల్‌ ఛాయిస్‌) ఉంటాయి. ప్రశ్నపత్రం రెండు భాషల్లో ఉంటుంది. అంటే ఆంగ్లంతో పాటు అభ్యర్థులు ఎంచుకున్న తెలుగు/ఉర్దూ/హిందీ/ బెంగాలీ/కన్నడ/మరాఠీ/తమిళ్‌/గుజరాతీ భాషల్లో ఉంటుంది.
* ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తూ వారి నియామకాన్ని కాంపిటెంట్‌ అథారిటీ ఆమోదం తెలపకుంటే వారూ టెట్‌ రాసుకోవచ్చు.

సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్‌
దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించే ముందు, తర్వాత ఏమైనా సందేహాలుంటే మార్చి 26 నుంచి జూన్‌ 12 వరకు పనిదినాల్లో ఫోన్‌ చేయవచ్చు. అందుకు ఎస్‌సీఈఆర్‌టీలోని టీఎస్‌-టెట్‌ సెల్‌లో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు.
* టెట్‌ కార్యాలయం: 8341371079, 8341831080
* సాంకేతిక సమస్యలకు( సీజీజీ కార్యాలయంలో): 040 23120340, 040 23120433
* టెట్‌, ఇతర సందేహాలకు: 8121010310, 8121010410

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని