Telangana News: జీవితకాల బాదుడు

వాహన కొనుగోలుదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పన్ను(లైఫ్‌ ట్యాక్స్‌)ను పెంచుతూ నిర్ణయించింది. ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని ప్రభుత్వం 4 శ్లాబులకు పెంచింది.

Updated : 10 May 2022 05:29 IST

నూతన వాహన కొనుగోలుదారులపై పన్ను మోత
లైఫ్‌ ట్యాక్స్‌ పెంచుతూ సర్కారు నిర్ణయం  
అమలులోకి వచ్చిన నూతన విధానం
ఈనాడు - హైదరాబాద్‌

* రూ. లక్ష లోపు విలువ చేసే ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు రూ. 9 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఇక నుంచి రూ. 12 వేలు జీవితకాల పన్ను చెల్లించాలి. అంటే రూ.3 వేలు అదనం.
* రూ.10 లక్షల లోపు విలువ చేసే కారు కొనుగోలు చేస్తే గతంలో సుమారు రూ.1.20 లక్షలు పన్ను రూపంలో చెల్లించేవారు. ఇక నుంచి రూ. 1.40 లక్షలు చెల్లించాలి. రూ.20 వేలు పెరిగింది.

వాహన కొనుగోలుదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పన్ను(లైఫ్‌ ట్యాక్స్‌)ను పెంచుతూ నిర్ణయించింది. ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని ప్రభుత్వం 4 శ్లాబులకు పెంచింది. గతంలో రూ.10 లక్షలలోపు విలువ చేసే వాహనాలకు ఒక పన్ను, రూ.10 లక్షల విలువ దాటిన వాహనాల పన్ను మరొకటిగా ఉండేది. తాజాగా వాహన విలువలను 4 విభాగాలుగా విభజించి పన్నులను వసూలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. వాహనాల విలువలో ఒకటి నుంచి 6 శాతం అదనంగా పెంచింది. అదే ద్విచక్రవాహనాల విషయానికొస్తే 1 నుంచి 3 శాతం వరకు పన్ను పెరిగింది. గతంలో కొత్త వాహనాలకు 9 శాతం ట్యాక్స్‌ ఉండేది. తాజాగా రూ.50 వేల విలువ దాటిన కొత్త వాహనంపై 12 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి రెండో వాహనం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే గతంలో వలే 2 శాతం మొత్తాన్ని అదనంగా కట్టాలి. గతంలో ద్విచక్రవాహనాలు ఇంజిను సామర్థ్యం 60 సీసీ, 60 సీసీలు మించిన వాహన కేటగిరీలు ఉండేవి. తాజాగా వాహన విలువ ఆధారంగా రెండు శ్లాబుల్లో పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. తాజా పెంపు వల్ల రూ.వెయ్యి కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందన్నది సర్కారు అంచనా. మూడు, నాలుగు చక్రాలు, మోటారు క్యాబ్స్‌, కార్లు, జీపులు, (నాన్‌ట్రాన్స్‌పోర్టు) కొత్త వాహనాలకు రూ.5లక్షల లోబడి ఉన్న వాహనాలకు 13 శాతం, రూ.10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 14శాతం, రూ.20 లక్షల లోపు ఉన్న వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల పైబడి ఉన్న వాహనాలకు 18 శాతంగా నిర్ణయించారు. రవాణా వాహనాలకు సంబంధించి రూ.5లక్షల లోబడి ఉన్న వాహనాలకు 15 శాతం, 10 లక్షల లోపు ఉన్న వాహనాలకు 16శాతం, రూ.20 లక్షలు ఉన్న వాహనాలకు 19 శాతం, రూ.20 లక్షల పైబడి ధర ఉన్న వాటికి 20 శాతంగా నిర్ణయించారు. 

వాహనాల జీవితకాల పన్నును తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల తరవాత పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ.3,335 కోట్లు రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,953 కోట్ల వరకు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రవాణాశాఖ ఆదాయంలో సింహభాగం వాహనాల జీవిత కాల పన్నుల నుంచే వస్తుంది. తాజాగా సవరణలతో ఆదాయం అంచనాలను మించుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకారణంగా ప్రజలు వ్యక్తిగత వాహనాలు కొనుగోలు పెరుగుతోంది. ఈక్రమంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని