ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పుర్కర్‌ కమిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికను తాము స్వాగతిస్తున్నట్లు తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్‌సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ గెడ్డం పేర్కొన్నారు. 1973 నుంచి

Published : 24 May 2022 04:55 IST

తెలంగాణ పౌర హక్కుల సంఘం

నాంపల్లి, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పుర్కర్‌ కమిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికను తాము స్వాగతిస్తున్నట్లు తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్‌సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ గెడ్డం పేర్కొన్నారు. 1973 నుంచి జరిగిన ఎన్‌కౌంటర్‌లన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు, ఈసీ మెంబర్‌ డి.సురేష్‌కుమార్‌, దిశ ఎన్‌కౌంటర్‌ బాధితుల తరఫు న్యాయవాది కృష్ణమాచారి తదితరులతో కలిసి లక్ష్మణ్‌ మాట్లాడారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టు చట్టబద్ధంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు.

29న రెండో రాష్ట్ర మహాసభలు

పౌరుల హక్కులు హరిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధకచట్టం (ఉపా) రద్దు కోసం పోరాడాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం  పిలుపునిచ్చింది. సంఘం రెండో రాష్ట్ర మహాసభలను ఈ నెల 29వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ వలసాంధ్ర ప్రభుత్వాన్ని మించిన అణచివేతను హక్కుల సంఘాలపై అమలు చేస్తోందని దుయ్యబట్టారు. పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పాత్రికేయులు పాశం యాదగిరి, పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు వేదంగి చిట్టిబాబు తదితరులు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని