Published : 29 May 2022 06:08 IST

భారం విద్యార్థులపైనే!

బీటెక్‌కు ఈసారి కేంద్రం ఆమోదించిన కనీస ఫీజు రూ.79,600

బీసీ, ఓసీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది రూ.35 వేలే

ఈనాడు, హైదరాబాద్‌: మూడేళ్లకోసారి ఇంజినీరింగ్‌ ఫీజులు భారీగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోధన రుసుముల్లో మాత్రం మార్పు ఉండటం లేదు. ఫలితంగా బీసీ, ఓసీ విద్యార్థులపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఈసారి కనీస ఫీజును రూ.79,600గా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్దేశించడమే కాకుండా.. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అది అమలైతే ఈసారి వేల మందిపై అధిక ఫీజుల భారం పడనుంది. ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో కనీస ఫీజుల నిర్ధారణపై తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీటెక్‌కు కనీస ఫీజు రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.1.34 లక్షలు ఉన్నాయి. 158 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా వాటిలో రూ.35 వేల ఫీజున్న కళాశాలలు 20 వరకు ఉన్నాయి. రూ.80 వేలలోపు రుసుమున్న కళాశాలలు దాదాపు 110 ఉన్నాయి. మిగిలిన వాటిల్లో రూ.80 వేల నుంచి రూ.1.34 లక్షల వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన, ఏఐసీటీఈ నిర్దేశించిన ఫీజులను- కనిష్ఠం రూ.79,600, గరిష్ఠం రూ.1,89,800 అమలు చేస్తే భారీగానే పెరగనున్నాయి. ఏఐసీటీఈ నుంచి ఆదేశాలు రాకముందే గరిష్ఠంగా 25 శాతం పెంచుతామని టీఏఎఫ్‌ఆర్‌సీ ప్రకటించింది. అంటే ప్రస్తుతం రూ.35 వేలున్న ఫీజు రూ.43,750 అవుతుంది. కానీ, కనీస నాణ్యత ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్‌ విద్యను అందించాలంటే కనీస ఫీజు రూ.79,600 ఉండాల్సిందేనని, ఆ ఫీజు స్థాయికి రాలేని కళాశాలలను మూసేయాలనీ ఏఐసీటీఈ ఆదేశించినట్లు సమాచారం. ఆ రుసుములకు తగ్గట్టు వసతులు కల్పించేందుకు మూడేళ్ల సమయం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఫీజులు భారీగా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలవుతోంది. ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు తెచ్చుకున్న అన్ని వర్గాల వారికీ పూర్తిగా చెల్లిస్తున్నారు. బీసీలు, ఓసీలకు మాత్రం కళాశాల ఫీజు ఎంతున్నా గరిష్ఠంగా రూ.35 వేలే బోధన రుసుముగా ఇస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే సొంతంగా చెల్లించాలి. ఏటా కన్వీనర్‌ కోటాలో 48 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు చేరుతున్నారు. వారిలో సుమారు 70 శాతం వరకు బోధన రుసుము పొందేందుకు అర్హులు ఉంటున్నారు. గత ఏడాది(2021-22) బీటెక్‌ సీట్లు పొందినవారిలో 67 శాతం(41 వేల) మంది బోధన రుసుముకు అర్హులయ్యారు. వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 20 వేల మంది అర్హులయ్యారు. వారందరూ ఎస్సీ, ఎస్టీలతో పాటు 10 వేలలోపు ర్యాంకు సాధించినవారే. మిగిలిన 21 వేల మంది రూ.35 వేలు పొందేందుకు అర్హత సాధించారు. వారందరూ బీసీ, ఓసీలే. వచ్చే విద్యాసంవత్సరం ఫీజులు పెరిగితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బంది ఉండదు. వారికి ప్రభుత్వమే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇక భారం పడేది బీసీ, ఓసీ విద్యార్థులపైనే. వారికి ప్రభుత్వం రూ.35 వేలే చెల్లిస్తోంది. ఇప్పుడున్న ఫీజు కంటే రూ.10 వేలు పెరిగినా 21 వేల మందిపై ఏడాదికి మొత్తం రూ.21 కోట్ల భారం పడుతుంది. అదే సమయంలో పూర్తి బోధన రుసుములు చెల్లించాల్సిన 20 వేల మందికి సంబంధించి రాష్ట్ర ఖజానాపై మరో రూ.20 కోట్ల భారం తప్పదు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే తమకూ పూర్తి బోధన రుసుము చెల్లించాలని బీసీ సంఘాలు గత కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని