పురుగుల అన్నం తినలేం.. రోడ్డెక్కి విద్యార్థుల నిరసన

పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల(జడ్పీహెచ్‌ఎస్‌) విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఎదుట ప్రధాన

Published : 05 Jul 2022 05:49 IST

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల(జడ్పీహెచ్‌ఎస్‌) విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బోయపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో సుమారు 350 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని గమనించిన విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం అన్నం పేట్లను రోడ్డుపై కొడుతూ తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. మహబూబ్‌నగర్‌-నవాబుపేట రహదారిపై రాకపోకలు నిలిచిపోవటంతో రూరల్‌ సీఐ మహేశ్వర్‌, ఎస్‌ఐలు సిబ్బందితో అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. అయినా విద్యార్థులు ఆందోళనను విరమించకుండా డీఈవో రావాలంటూ వంట సామగ్రిని కింద పడేశారు. విద్యార్థులు, హెచ్‌ఎం వసంతయామిని, సిబ్బందితో ఎంఈవో జయశ్రీ సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు తెలుసుకున్నారు. కొందరు విద్యార్థులు ఈ హెచ్‌ఎం తమకొద్దంటూ మరోసారి ఆందోళనకు పూనుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని ఎంఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగడంతో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని