Hyderabad: సరదా తెచ్చిన సమస్య.. కాపాడిన తిరుమలగిరి పోలీసులు

సరదా పడి ఓ యువకుడు పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు.

Updated : 31 Jan 2023 07:44 IST

బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు

కార్ఖానా, న్యూస్‌టుడే: సరదా పడి ఓ యువకుడు పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు. దాదాపు 3 గంటల పాటు అందులో ఇరుక్కుపోగా.. పోలీసులు రక్షించారు. తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజు(26) బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్‌ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడ్డాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుళ్లు రాంబాబు, బాషా, రాజు.. అక్కడికి చేరుకొని అతడి భూజానికి తాళ్లు కట్టి అతికష్టం మీద బయటకు లాగారు. అనంతరం చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వదిలారు. రాజును కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్‌కుమార్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని