రెండు గంటల్లో రక్తశుద్ధి.. మూత్రపిండ రోగులకు వరంగా ఐఐసీటీ పరిశోధన

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) చేపట్టిన పరిశోధన కొంత ఉపశమనం కలిగించనుంది.

Updated : 11 Mar 2023 04:14 IST

దేశీయంగా తొలిసారి హీమోడయాలసిస్‌ మెంబ్రేన్‌ మాడ్యుల్‌ అభివృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) చేపట్టిన పరిశోధన కొంత ఉపశమనం కలిగించనుంది. పూర్తిగా దేశీయ సాంకేతికతతో పరిశోధకులు పాలి సల్ఫోన్‌ హ్యాలో ఫైబర్స్‌ ఆధారంగా హీమోడయాలసిస్‌ మెంబ్రేన్‌ మాడ్యుల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం జంతువులపై ప్రయోగాల దశలో ఉన్న పరిశోధన.. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంటే డయాలసిస్‌ చికిత్సకు పట్టే సమయం, ఖర్చు సగానికి సగం తగ్గనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగి పరిస్థితిని బట్టి డయాలసిస్‌ కొందరికి వారంలో 4 రోజులు చేయించుకోవాల్సి వస్తే, మరికొందరికి రోజూ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో డయాలసిస్‌ యంత్రం సాయంతో రోగి రక్తం శుద్ధికి 4 గంటల సమయం పడుతుంది. ఈసమయంలో ప్రతిసారీ హ్యాలో ఫైబర్‌ డయలైజర్‌ను మార్చాల్సిందే. ఇవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ఖర్చు ఎక్కువగా ఉంటోంది. రక్తాన్ని శుద్ధి చేసే హీమోడయాలసిస్‌ మెంబ్రేన్‌ను పాలి సల్ఫోన్‌ హ్యాలో ఫైబర్స్‌ ఆధారంగా మాడ్యుల్‌ను ఐఐసీటీ తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసింది. గొర్రె రక్తంతో పరీక్షించి చూడగా విజయవంతంగా శుద్ధి జరిగినట్లు    పరిశోధకులు తెలిపారు. బతికి ఉన్న గొర్రెపై ప్రయోగాలు చేసేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం జాతీయ జంతు పరిశోధన సంస్థతో ఐఐసీటీ చేతులు కలిపింది. ఈ దశలు దాటుకుని అందుబాటులోకి  వస్తే ఇప్పుడున్న మాడ్యుల్స్‌ ధర తగ్గుతుందని, రెండు గంటల్లోనే రక్తం శుద్ధి ప్రక్రియ పూర్తవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.


మిషన్‌ మోడ్‌తో పరిశోధన చేస్తున్నాం

డయాలసిస్‌ కోసం ప్రస్తుతమున్న మెంబ్రేన్‌ మాడ్యుల్స్‌ జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సీఎస్‌ఐఆర్‌ మిషన్‌ మోడ్‌ కింద దిగుమతికి ప్రత్యామ్నాయంగా తొలిసారి స్వదేశీ డయాలసిస్‌ మెంబ్రేన్‌ మాడ్యుల్స్‌పై పరిశోధన చేపట్టాం. జంతువులపై ప్రయోగించినప్పుడు రక్తంలో ఉన్న వివిధ జీవక్రియల టాక్సిన్స్‌ తొలగించినట్లు గుర్తించాం. పరిశ్రమ తోడ్పాటుతో ప్రాజెక్ట్‌ తదుపరి దశలో క్లినికల్‌ ట్రయల్స్‌, తర్వాత పెద్దఎత్తున ఉత్పత్తి ప్రణాళిక ఉంది.

డాక్టర్‌ శ్రీధర్‌, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసీటీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని