పంట నష్టం అంచనాకు ని‘బంధనాలు’

పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ నిబంధన ఇలాంటి ఎందరో రైతుల పాలిట శాపంగా మారింది. భారీ వర్షాలు, వరదలు, వడగళ్లు, ఇతర రకాలుగా నష్టపోయినా..

Updated : 23 Mar 2023 05:40 IST

33% దెబ్బతింటేనే పరిహారం అంటూ వ్యవసాయశాఖ నిబంధన
ఆవేదన వ్యక్తంచేస్తున్న రైతులు
ఈనాడు - హైదరాబాద్‌

కరీంనగర్‌ జిల్లాలో రైతు రాజేందర్‌ ఎకరా పొలంలో మిర్చి వేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంట దెబ్బతింది. అధికారులు సర్వేచేసి పంట నష్టం 33% (మూడో వంతు) కంటే తక్కువగా ఉందన్న కారణంగా నమోదు చేయలేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర ఎకరాలో ఉల్లి పంట వేసిన స్వామి, సూర్యాపేట జిల్లాలో మామిడి రైతు నాగరాజు.. ఇలా పలువురు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖ నిబంధన ఇలాంటి ఎందరో రైతుల పాలిట శాపంగా మారింది. భారీ వర్షాలు, వరదలు, వడగళ్లు, ఇతర రకాలుగా నష్టపోయినా.. 33 శాతం కంటే ఎక్కువ ఉంటేనే దానిని పంట నష్టంగా నమోదు చేసే విధానం వల్ల చాలామందికి సాయం అందని పరిస్థితి నెలకొంది. ఆది నుంచి వ్యవసాయ శాఖ ఈ నిబంధనను అమలు చేస్తోంది. సాధారణంగా విపత్తుల సమయంలో ఏమాత్రం పంట దెబ్బతిన్నా అది అన్నదాతకు నష్టదాయకమే. అయితే పంట నష్టం 33 శాతం కంటే తక్కువ ఉంటే దానిని వ్యవసాయ శాఖ పరిగణించడం లేదు. పరిహారంతో పాటు బీమా పథకం అమలులోనూ ఇదే నిబంధన అమలు చేయడం వల్ల అలాంటి రైతులు కనీస సాయానికి నోచుకోలేకపోతున్నారు. పంట నష్టాలు సంభవించిన వెంటనే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తారు. ఈ సందర్భంగా రైతుల సామాజిక స్థితి, భూమి ఆధారంగా వారిని చిన్న లేదా సన్నకారు లేదా ఎక్కువ ఎకరాలున్న రైతులుగా నమోదు చేస్తారు. వారికి ఉన్న భూమి, వేసిన పంటల ఆధారంగా 33% కంటే తక్కువ, 33-50 శాతం, 50% కంటే ఎక్కువ కేటగిరీలుగా పంట నష్టం వివరాలను నమోదు చేస్తారు. ఇందులో 33 శాతం కంటే తక్కువ నష్టపోతే నమోదు చేయడం లేదు. మిగతా రెండు కేటగిరీలనే నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం వ్యవసాయాధికారులు ఈ జాబితాలను గ్రామ పంచాయతీల వారీగా నోటీసు బోర్డులపై పెడుతున్నారు. అయితే ‘33% కంటే తక్కువ’ నిబంధన అమలు ద్వారా చాలామంది రైతుల వివరాలు వాటిలో లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు అధికారులను నిలదీస్తున్నారు. వాస్తవానికి వర్షాలు పడితే 10 నుంచి 20 శాతానికి పైగా నష్టం వాటిల్లుతోంది. వరి, పత్తి, మిర్చి వంటి పంటలు విలువైనవి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. అందులో 33 శాతం వరకు నష్టం కూడా రైతులకు ఇబ్బందికరమే. దాన్నీ నమోదు చేయాలని రైతులు కోరుతున్నా.. నిబంధనల పేరిట వ్యవసాయాధికారులు తిరస్కరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలను సడలించాలని.. ఎంత నష్టం జరిగినా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు.


ఎకరాకు రూ.20 వేల పరిహారమివ్వాలి

జూలకంటి

వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి బుధవారం డిమాండ్‌ చేశారు.  


బీమా అమలుచేయాలి

పాకాల

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ప్రభుత్వాన్ని కోరారు. అతివృష్టి, అనావృష్టి, వడగళ్లు, చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు బీమా అమలులో లేనందున మరింత నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని