గత పది నెలల్లో.. రూ.8,409 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాల ధ్వంసం

జప్తు చేసిన నిషేధిత మాదకద్రవ్యాల్ని ఎప్పటికప్పుడు ధ్వంసం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని ‘డ్రగ్‌ ఫ్రీ ఇండియా’ సదస్సులో నిర్ణయించారు.

Updated : 26 Mar 2023 05:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: జప్తు చేసిన నిషేధిత మాదకద్రవ్యాల్ని ఎప్పటికప్పుడు ధ్వంసం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని ‘డ్రగ్‌ ఫ్రీ ఇండియా’ సదస్సులో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు 75 వేల కిలోల మాదకద్రవ్యాల్ని ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అనూహ్యంగా రూ.8,409 కోట్ల విలువైన 5,94,620 కిలోల మాదకద్రవ్యాల్ని ధ్వంసం చేసినట్లు ఈ సదస్సు నివేదికలో వెల్లడించారు. బెంగళూరులో రెండు రోజుల పాటు (శుక్ర, శనివారాలు) జరిగిన ‘డ్రగ్‌ ఫ్రీ ఇండియా’ సదస్సులో శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)తో సమన్వయంగా సాగాలని దిశానిర్దేశం చేశారు. దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయంతో కూడిన కార్యాచరణ గురించి సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. 2019లో ఏర్పాటైన నేషనల్‌ నార్కోటిక్స్‌ కో-ఆర్డినేషన్‌ (ఎన్‌కార్డ్‌) పోర్టల్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఎన్‌కార్డ్‌ కమిటీ.. రాష్ట్రాలస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీలతో నిరంతరం సమన్వయంతో సాగాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిషేధిత మాదకద్రవ్యాల రవాణా ముఠాల స్థితిగతుల్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ ‘సీజర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (సిమ్స్‌) పేరుతో ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మాదకద్రవ్యాల జప్తు సమాచార మార్పిడికి దీనిని ఉపయోగించుకోనున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ నుంచి డీజీపీ అంజనీకుమార్‌ హాజరయ్యారు.

తెలంగాణలో..

* 2022లో తెలంగాణవ్యాప్తంగా నిషేధిత మాదక ద్రవ్యాల కేసులు 1176 నమోదయ్యాయి. 2,582 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. మొత్తం కేసుల్లో గంజాయికి సంబంధించినవే 1104 కేసులు ఉన్నాయి. 31,301 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 593 గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు.  

* హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) విభాగం గతేడాది జూన్‌లో 20.35 కిలోల హెరాయిన్‌, 4,812 కిలోల గంజాయిని దహనం చేసింది. అదేసమయంలో దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 42,000 కిలోల మాదకద్రవ్యాల్ని దహనం చేయడం గమనార్హం.

* గతేడాది డిసెంబరులో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు 1500 కిలోల గంజాయి, 1100 గ్రాముల హాష్‌ఆయిల్‌, 500 గ్రాముల ఎండీఎంఏను ధ్వంసం చేశారు. 45 ఘటనల్లో ఈ మాదకద్రవ్యాలు దొరికాయి.

* సైబరాబాద్‌ పోలీసులు గతేడాది జులైలో దుండిగల్‌ శివార్లలోని వ్యర్థాల నిర్వహణ పరిశ్రమలో 1338.05 కిలోల గంజాయి, 485 మి.లీ.ల హాష్‌ ఆయిల్‌, 11 గ్రాముల కొకైన్‌ను కాల్చేశారు. వీటి విలువ రూ.2.5 కోట్లుగా లెక్కగట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని