రాష్ట్రంలో క్లోవర్టెక్స్‌ రూ.100 కోట్ల పెట్టుబడులు

అమెరికాకు చెందిన ‘క్లోవర్టెక్స్‌’ సంస్థ తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో సైంటిఫిక్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పనిచేస్తున్న క్లోవర్టెక్స్‌ అంతర్జాతీయ, పాన్‌-ఇండియా వినియోగదారులకు సేవలందించేందుకు హైదరాబాద్‌లోని తమ గ్లోబల్‌ కేపబిలిటీస్‌ సెంటర్‌(జీపీసీ)ను విస్తరించాలని నిర్ణయించింది.

Published : 24 May 2023 04:27 IST

హైదరాబాద్‌లోని జీపీసీ  విస్తరణకు సుముఖం
అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన ‘క్లోవర్టెక్స్‌’ సంస్థ తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో సైంటిఫిక్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పనిచేస్తున్న క్లోవర్టెక్స్‌ అంతర్జాతీయ, పాన్‌-ఇండియా వినియోగదారులకు సేవలందించేందుకు హైదరాబాద్‌లోని తమ గ్లోబల్‌ కేపబిలిటీస్‌ సెంటర్‌(జీపీసీ)ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో బోస్టన్‌ నగరంలో సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి క్షితిజ్‌ కుమార్‌ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌ బృందం సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి ఎం.నాగప్పన్‌, సమ్మిట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అండ్‌ సీఈఓ సందీప్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘‘క్లోవర్టెక్స్‌ హైదరాబాద్‌లోని జీపీసీని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నందుకు సంతోషిస్తున్నా. దీనివల్ల 100-150 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి’’ అని తెలిపారు. 2019లో స్థాపించిన క్లోవర్టెక్స్‌ సంస్థ నూతన ఔషధాల పరిశోధనలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషధం మార్కెట్‌లోకి రావడానికి సాధారణంగా పదేళ్లు పడుతోంది. ఔషధ ఆవిష్కరణ సమయాన్ని తగ్గించడం, రోగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడటం క్లోవర్టెక్స్‌ ప్రధాన లక్ష్యం. ‘‘తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయాన్ని మేము నిజంగా అభినందిస్తున్నాం. స్థానిక, అంతర్జాతీయ కంపెనీలకు కూడా ప్రపంచస్థాయి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది’’ అని క్లోవర్టెక్స్‌ వ్యవస్థాపకుడు క్షితిజ్‌కుమార్‌ తెలిపారు.

స్టేట్‌ స్ట్రీట్‌ రాకతో 5 వేల ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని బ్యాంకింగ్‌, ఆర్థిక, బీమా రంగాలకు గొప్ప ప్రోత్సాహం లభించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 40 ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులతో అతి పెద్ద మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఒకటైన ‘స్టేట్‌ స్ట్రీట్‌’ సంస్థ హైదరాబాద్‌లో అయిదు వేల కొత్త ఉద్యోగాలను కల్పించడానికి తమ కార్యకలాపాలను విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలిస్ట్‌ తదితర సాంకేతిక నైపుణ్యాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

* గ్రిడ్‌ డైనమిక్స్‌ హోల్డింగ్స్‌ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తమ సేవల సంస్థను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశం అనంతరం గ్రిడ్‌ డైనమిక్స్‌ ఛైర్మన్‌ లాయిడ్‌ కార్నీ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

* క్లౌడ్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, సెక్యూరిటీ, ఈఎస్‌జీ, డేటా సెంటర్‌ పరిశ్రమల్లో విస్తృతమైన నైపుణ్యమున్న పెట్టుబడి సంస్థగా పేరొందిన ఆరం ఈక్విటీ పార్టనర్స్‌ సంస్థ అంతర్జాతీయ విస్తరణకు 250 మిలియన్‌ డాలర్లను కేటాయించగా... ఇందులో 50 మిలియన్‌ డాలర్లను హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఖర్చు చేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది.

* కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టడీస్‌’తో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. రవాణాలో పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించడానికి అందుబాటులో అవకాశాలపై సంస్థ పరిశోధనలు చేస్తుంది.


కాళేశ్వరం నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకోవచ్చు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు అందించిన ‘అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌’ సంస్థ ప్రెసిడెంట్‌ మరియా సి.లెమన్‌, ఇతర ప్రతినిధులు ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. నెవెడాలో సోమవారం ప్రారంభమైన ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించినప్పటి తమ అనుభవాలను పంచుకున్నారు. లెమన్‌ మాట్లాడుతూ... కాళేశ్వరం లాంటి వినూత్నమైన, అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడం తమ ఉద్దేశమన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి ప్రపంచ దేశాలు వినూత్న పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని