అన్ని శాఖల విభాగాధిపతులకు జంట సౌధాలు

ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాధిపతులు ఒకేచోట పనిచేసేలా జంట సౌధాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

Updated : 30 May 2023 06:42 IST

సచివాలయం  సమీపంలో నిర్మాణం
అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం
సీఎం కేసీఆర్‌ నిర్ణయం
రెండు రోజుల్లో కుల వృత్తుల చేయూతపై విధివిధానాలు
సీఎంకు వివరించిన గంగుల

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వంలోని అన్ని శాఖల విభాగాధిపతులు ఒకేచోట పనిచేసేలా జంట సౌధాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆయా విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాలనూ ఒకేచోట నిర్మించాలన్నారు. హెచ్‌ఓడీ అధికారులు తరచూ సచివాలయానికి రావాల్సిన అవసరం ఉండడంతో.. వారి కార్యాలయాలు అక్కడికి సమీపంలో సమీకృతంగా ఒకేచోట ఉంటే బాగుంటుందని సీఎం పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలు, కుల వృత్తులకు చేయూత, జంట సౌధాల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌ఓడీలు, వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తి స్థాయి సిబ్బంది సంఖ్య తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలో విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయని ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌ఓడీలు ఒకేచోట ఉండేలా.. జంట సౌధాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను మరోసారి ఆదేశించారు. జూన్‌ రెండు నుంచి రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి.. సీఎం కేసీఆర్‌కు   వివరించారు. దేశం గర్వించేలా నిర్మించుకున్న సచివాలయంలో అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం హర్షం వ్యక్తంచేశారు. వసతుల గురించి సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.

త్వరితగతిన విధివిధానాలు..

కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీలలో కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాలుË తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం స్పష్టంచేశారు. వీరికి లక్షరూపాయల చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి విధి విధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్‌కమిటీ ఛైర్మన్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సీఎం కేసీఆర్‌కు వివరించారు. త్వరితగతిన విధివిధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని మంత్రిని సీఎం ఆదేశించారు.

ఘనంగా ఏర్పాట్లు చేయాలి..

సమీక్ష అనంతరం అమరుల స్మారకం వద్దకు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ కలియతిరిగారు.  ఇప్పటికే మిగతా పనులన్నీ పూర్తయి, చివరి దశ సుందరీకరణ జరుగుతున్న నేపథ్యంలో.. రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్కడి నుంచి బీఆర్‌కే భవన్‌ వద్ద నిర్మించిన వంతెనలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ వంతెనలను నిర్మించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, సీఎం కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, స్మితా సభర్వాల్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఈఈ శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని