ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు!

ఆర్టీసీలో ఓవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.

Published : 08 Apr 2024 02:59 IST

ఏప్రిల్‌-డిసెంబరు మధ్య మరో 1,354 మంది పదవీ విరమణ
‘మహాలక్ష్మి’తో గణనీయంగా పెరిగిన ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఓవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. ఈ పథకం ముందునాటి పరిస్థితితో పోలిస్తే రోజుకు దాదాపు 15 లక్షల మంది అదనంగా ప్రయాణాలు చేస్తున్నారు. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. మార్చి నెలాఖరులో 176 మంది పదవీ విరమణ పొందగా.. ఏప్రిల్‌-డిసెంబరు మధ్య మరో 1,354 మంది రిటైర్‌ కానున్నారు. వీరిలో డ్రైవర్లు 403 మంది.. కండక్టర్లు 350 మంది ఉన్నారు.

2 వేల కొత్త బస్సులకు ప్రణాళికలు..

పెరిగిన ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో రెండు వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇవి కార్యరూపం దాల్చి కొత్త బస్సులు రోడ్డెక్కితే వాటిని నడిపేందుకు, నిర్వహణకు అవసరమైన సిబ్బంది కావాలి. ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలున్నాయి. మంజూరైన (శాంక్షన్డ్‌) పోస్టుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫిబ్రవరి నాటికి.. కండక్టర్లు మినహా 9 విభాగాల్లో 25,965 శాంక్షన్డ్‌ పోస్టులుండగా, పనిచేస్తున్నవారి సంఖ్య 16,274. అంటే 9,691 ఖాళీలున్నాయి. డ్రైవర్‌ పోస్టులు 22,174 కాగా.. పనిచేస్తున్నది 14 వేల పైచిలుకు మాత్రమే. అయితే విభజన సమయంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుతం బస్సుల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 3,035 ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 17,410 మంది కండక్టర్లు ఉన్నారు. ఖాళీల భర్తీ ప్రతిపాదనల్లో కండక్టర్‌ పోస్టులు మాత్రం లేవు.

పదవీ విరమణ వయసు పెరిగితే..!

ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు 60 ఏళ్లకు రిటైర్‌ అవుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తికాలేదు. ఇది పూర్తయితే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే 61 ఏళ్లకు ఉంటుంది. అప్పుడు వచ్చే మార్చి వరకు పదవీ విరమణల ప్రభావం తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని