మళ్లీ పెగా‘బుస్‌’

దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్‌’ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ విషయంలో... ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య 2017లో కుదిరిన

Updated : 30 Jan 2022 04:32 IST

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను 2017లోనే కొన్నారు
భారత్‌-ఇజ్రాయెల్‌ రక్షణ ఒప్పందంలో ఇది భాగమే...
న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా నివేదిక
భగ్గుమన్న విపక్షాలు
బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని హెచ్చరిక

న్యూయార్క్‌, దిల్లీ: దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్‌’ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ విషయంలో... ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య 2017లో కుదిరిన రూ.15 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్‌ కూడా ముఖ్య భాగమేనని పేర్కొంది. ఈ మేరకు ‘ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన సైబర్‌ ఆయుధం కోసం పోరాటం’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి... భారత్‌ సహా పలుదేశాల ప్రభుత్వాలు విపక్ష నేతలపైనా, పాత్రికేయులపైనా, హక్కుల నేతలపైనా, న్యాయమూర్తులపైనా నిఘా ఉంచినట్టు గత ఏడాది అంతర్జాతీయ మీడియా వెల్లడించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకురావడం తేనెతుట్టెను కదిపినట్టయింది.

కథనంలో ఏముంది?
‘‘ఎన్‌ఎస్‌వో సంస్థ 2011 నుంచే పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ తమలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వలేవని... ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలోని ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్లను కూడా తమ స్పైవేర్‌ అత్యంత సమర్థంగా వెల్లడించగలదని బల్ల గుద్ది చెబుతోంది. భారత్‌... దశాబ్దాల తరబడి పాలస్తీనా పట్ల సానుకూల వైఖరితో ఉండేది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. నాటి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో అత్యంత స్నేహపూర్వకంగా మెలిగారు. ఇద్దరూ చెప్పుల్లేకుండా అక్కడి సముద్రతీరాన వాహ్యాళికి కూడా వెళ్లారు. వారి మధ్య అంత సుహృద్భావ వాతావరణం ఉండటానికి కారణం- రక్షణ ఒప్పందం! దీని విలువ సుమారు రూ.15 వేల కోట్లు (2 బిలియన్‌ డాలర్లు). మొబైల్‌ ఫోన్లపై నిఘా పెట్టేందుకు దోహదపడే పెగాసస్‌ స్పైవేర్‌, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలే ప్రధానంగా రెండు దేశాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తర్వాత కొన్ని మాసాలకు నెతన్యాహు కూడా భారత్‌ విచ్చేశారు. ఈ క్రమంలోనే, పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలక హోదాను నిరాకరించాలంటూ ఇజ్రాయెల్‌ 2019 జూన్‌లో ఐరాస ఆర్థిక-సామాజిక మండలిలో ప్రతిపాదించింది. దీనికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది!

ఎఫ్‌బీఐదీ అదేదారి.. కానీ..
అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) కూడా పెగాసస్‌ను సమకూర్చుకుంది. అయితే, ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే వార్తా సంస్థల కన్సార్షియం...ఈ స్పైవేర్‌ను పాత్రికేయులపైనా, విపక్ష నేతలపైనా ఎలా ప్రయోగిస్తున్నారన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ సైబర్‌ ఆయుధాన్ని వినియోగించకూడదని ఎఫ్‌బీఐ నిర్ణయం తీసుకొంది. ఐరోపా నిఘా అధికారులు మొదట్లో పెగాసస్‌ సాయంతో నేరస్థులు, ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌ను ఛేదించారు. కాలక్రమంలో దీన్ని దుర్వినియోగం చేయడం పెరిగింది. మెక్సికో, యూఏఈ, సౌదీఅరేబియా తదితర చోట్ల ఇదే జరిగింది’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ వివరించింది. కాగా- విదేశాల్లో పనిచేస్తున్న తమ దౌత్య అధికారుల ఫోన్లను పెగాసస్‌ సాయంతో హ్యాక్‌ చేశారని ఫిన్లాండ్‌ విదేశాంగశాఖ శనివారం వెల్లడించింది.

దుమారం మొదలైంది ఇలా...
కొన్నిదేశాలు పెగాసస్‌ను ఉపయోగించి రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియా గత ఏడాది వెల్లడించడం తీవ్ర అలజడికి దారితీసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. ఇలా సుమారు 300 మంది ఫోన్లను స్పైవేర్‌తో హ్యాక్‌ చేసినట్టు అప్పట్లో ‘ది వైర్‌’ పేర్కొంది. దీంతో ఈ అంశం పార్లమెంటునూ కుదిపేసింది. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తల్లో నిజంలేదని చెప్పుకొచ్చింది. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా... పెగసస్‌ను వినియోగించారా? లేదా? అన్న విషయమై విచారణ జరిపేందుకు జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వాన  కమిటీని ఏర్పాటుచేసింది. ఎన్‌ఎస్‌వోకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెబుతున్న క్రమంలో... న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రభుత్వాలకే విక్రయిస్తున్నాం: ఎన్‌ఎస్‌వో
ఉగ్రవాదాన్ని, నేరాలను నియంత్రించడం కోసం పెగాసస్‌ను కేవలం ప్రభుత్వాలకే విక్రయిస్తున్నామని ఎన్‌ఎస్‌వో సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ రక్షణశాఖ ఆమోదం తెలిపిన తర్వాతే దీన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. ఫోన్‌లోని డేటాపై దీనికి నియంత్రణ ఉండదని పేర్కొంది. పెగాసస్‌ను దుర్వినియోగం చేసినట్టు తెలియడంతో కొన్ని కాంట్రాక్టులను రద్దుచేసుకున్నట్టు వివరించింది.

అది సుపారీ మీడియా: జనరల్‌ వీకే సింగ్‌
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ మండిపడ్డారు. ‘‘అది పూర్తిగా నిరాధార కథనం. ఆ సంస్థను నమ్ముతున్నారా? అదొక సుపారీ మీడియా’’ అంటూ ట్వీట్‌ చేశారు. పెగాసస్‌ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోందని, నివేదిక ఇంకా రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఐరాస ఆర్థిక-సామాజిక మండలిలో భారత్‌ ఓటు వేయడాన్ని వక్రీకరించడం చెత్త వ్యవహారమని ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వ్యాఖ్యానించారు.


ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిఘా పెట్టారు

న ప్రాథమిక ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా, విపక్ష నేతలు, ప్రభుత్వ అధికారులపైనా, న్యాయాధికారులపైనా, సాయుధ దళాలపైనా నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. అందరి ఫోన్లనూ ట్యాప్‌ చేశారు. మోదీ సర్కారు దేశద్రోహానికి పాల్పడింది.

- రాహుల్‌ గాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని