Telangana Budget 2022: మరో 10 లక్షల మందికి ఆసరా!

రాష్ట్రంలో మూడేళ్లుగా ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అసహాయులకు బడ్జెట్‌లో హామీ లభించింది. పెండింగ్‌ దరఖాస్తులతో పాటు 57 ఏళ్లు దాటిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం

Updated : 08 Mar 2022 05:39 IST

57 ఏళ్ల వారికీ ఇస్తామని ప్రకటన

రాష్ట్రంలో మూడేళ్లుగా ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అసహాయులకు బడ్జెట్‌లో హామీ లభించింది. పెండింగ్‌ దరఖాస్తులతో పాటు 57 ఏళ్లు దాటిన వారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.11,728 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ప్రతినెలా దాదాపు 48 లక్షల మందికి పింఛన్లు ఇవ్వవచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, ఇంటిపెద్దను కోల్పోయి వితంతువుగా మారిన మహిళలు, ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసిన 3.30 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి, 2021-22 నుంచి పింఛను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అమలు కాలేదు. గత ఆగస్టులో దరఖాస్తులు తీసుకోగా దాదాపు 7.8 లక్షల మంది అర్జీ పెట్టుకున్నారు. 

అందుబాటులో నెలకు రూ.977 కోట్లు

రాష్ట్రంలో గత మూడేళ్లుగా పింఛను కోసం అందిన దరఖాస్తులు, 57 ఏళ్లు దాటిన వారి దరఖాస్తులు పరిశీలిస్తే డూప్లికేట్‌ తీసివేయగా...దాదాపు 10 లక్షల మంది అర్హులు ఉంటారని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 38.41 లక్షల మంది పింఛను కోసం నెలకు రూ.775 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కొత్తగా వచ్చే లబ్ధిదారులకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. తాజాగా పెరిగిన కేటాయింపులతో అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యే అవకాశాలున్నాయి. 

ఆసరా పింఛన్లు ఇలా...

ప్రస్తుత పింఛనుదారులు: 38,41,000

పెండింగ్‌ దరఖాస్తులు: 3,30,089

57 ఏళ్లు దాటిన అర్హులు: 7,80,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని