TS High Court: కోర్టు ఉత్తర్వులంటే అంత చులకనా?.. జైలులో పెట్టిస్తాం: హైకోర్టు ఆగ్రహం

కోర్టు ఉత్తర్వులను అధికారులు చాలా చులకనగా చూస్తున్నారని, కఠినమైన ఉత్తర్వులు జారీచేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హైకోర్టు హెచ్చరించింది.

Updated : 10 Dec 2022 08:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కోర్టు ఉత్తర్వులను అధికారులు చాలా చులకనగా చూస్తున్నారని, కఠినమైన ఉత్తర్వులు జారీచేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హైకోర్టు హెచ్చరించింది. గత విచారణ సందర్భంగా వ్యక్తిగత కారణాలతో హాజరుకాని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శుక్రవారం కూడా రాకపోవడం పట్ల ఆగ్రహం ప్రకటించింది. సీఎంతో సమావేశం ఉంటే కోర్టుకు వెళ్లాలని ఆయనకు చెప్పి రావచ్చంది. వారెంట్‌లు ఇచ్చి అరెస్ట్‌ చేసి జైలులో పెట్టాలని డీజీపీకి చెబుతామంది. వచ్చేసారి అర్వింద్‌తోపాటు ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులు కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం హిల్‌ఫోర్టు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంపై హెరిటేజ్‌ ట్రస్ట్‌ దాఖలు చేసిన  వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ కార్యదర్శి కె.ఎస్‌.శ్రీనివాసరావు, ఆర్థికశాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, పర్యాటకశాఖ ఎండీ బి.మనోహర్‌రావు, హెచ్‌ఎండీఏ తరఫున డైరెక్టర్‌ ఎస్‌.బాలక్రిష్ణలు హాజరయ్యారు. పురపాలకశాఖ తరఫున అర్వింద్‌కుమార్‌ హాజరుకాకపోవడంపై ధర్మాసనం నిలదీసింది. గతంలో వేడుకంటూ రాలేదని, ఇప్పుడు సీఎం కార్యక్రమం ఉందంటూ హాజరుకాలేదంది. ఆయన ప్రవర్తన తీరును ఈ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని, వచ్చే విచారణకు హాజరుకాకుంటే వారెంట్‌లు జారీచేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హిల్‌ఫోర్టు పునరుద్ధరణకు రెండున్నరేళ్లుగా ఎలాంటి పనులు కొనసాగించడం లేదంది. ఇప్పటివరకు ఏం చేశారో స్పష్టమైన నివేదిక సమర్పించాలని గతనెల 22న ఆదేశించామని గుర్తుచేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ వాదనలు వినిపిస్తూ హిల్‌ఫోర్టు పరిసరాలను శుభ్రం చేస్తున్నారని, ఆర్కిటెక్ట్‌ అనురాధనాయక్‌ పనులను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇతర పనులను ప్రభుత్వ ఆమోదంతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తేదీలయినా లేని కొన్ని ఫొటోలను తమ ముందుంచారని, ఉద్యోగులు సక్రమంగా పనులు కొనసాగించనందున అధికారులను పిలిపించాల్సి వచ్చిందని ధర్మాసనం పేర్కొంది. జీతంతో పాటు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపివేస్తే అప్పుడు కదలిక వస్తుందని వ్యాఖ్యానించింది. పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా పనుల గురించి అధికారులతో మాట్లాడి నివేదిక సమర్పిస్తామని ఏజీ చెప్పినా..ఫలితం లేకపోయిందని పేర్కొంది. కేసును మధ్యాహ్నానికి వాయిదా వేస్తామని అప్పటిలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకావాలంది. అలాగే అర్వింద్‌కుమార్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తామనగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఒక్క వారం గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని