కొరత అని వారు.. లేదని వీరు

పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి కరోనా టీకా వేయడానికి ఉద్దేశించిన తేదీ (మే 1) దగ్గర పడినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం ఉన్న అరకొర నిల్వలతో అందరికీ

Updated : 30 Apr 2021 10:52 IST

45 ఏళ్లలోపు వారికి టీకాలపై తలోమాట
 కేంద్ర-రాష్ట్రాల గణాంకాల మధ్య కుదరని పొంతన

దిల్లీ: పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి కరోనా టీకా వేయడానికి ఉద్దేశించిన తేదీ (మే 1) దగ్గర పడినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం ఉన్న అరకొర నిల్వలతో అందరికీ టీకాలు వేయడం తమ వల్ల కాదని ఒక్కో రాష్ట్రం చేతులెత్తేస్తున్నాయి. కేంద్రం మాత్రం.. రాష్ట్రాల వద్ద ఇంకా కోటి డోసులు అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. శనివారం నుంచి 18-45 ఏళ్లలోపు వారిని కూడా అర్హులుగా తీసుకోనున్నందువల్ల దేశంలో దాదాపు 50-60 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్‌కు అర్హులవుతారు. వీరికి వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమానికి మే ఒకటినే శ్రీకారం చుట్టే పరిస్థితి లేదని పలు రాష్ట్రాలు స్పష్టంచేస్తున్నాయి.
మా వల్ల కాదు..
వ్యాక్సిన్లను వయోజనులందరికీ ఇచ్చే పరిస్థితి తమవద్ద లేదని పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్‌ సిద్ధూ తెలిపారు. కనీసం 10 లక్షల అదనపు డోసులు వస్తే తప్ప కార్యక్రమం ప్రారంభించలేమన్నారు. ఔషధ కంపెనీల నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్లు వస్తేనే 18-45 ఏళ్ల వారికి కరోనా టీకాలు వేసే అవకాశం ఉంటుందని గుజరాత్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 45 ఏళ్ల లోపువారికి టీకాలు వేసేటంత నిల్వలు తమ వద్ద లేవని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తేల్చిచెప్పేశారు. కనీసం మూడు కోట్ల డోసులు పంపించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుంచి టీకా నిల్వలు రానందున మూడు రోజుల పాటు వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ముంబయి అధికారులు ప్రకటించారు. కరోనా ఉచిత వ్యాక్సిన్ల కోసం తన ఏడాది వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాలాసాహెబ్‌ థోరాట్‌ ప్రకటించారు.
15 కోట్ల మార్కు దాటిన డోసులు
దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 15 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 15,21,05,563 డోసులు గురువారం రాత్రి వరకు తీసుకున్నారని తెలిపింది.
ఉచితంగానే వేయాలి: రాహుల్‌
వ్యాక్సిన్‌ను దేశంలో అర్హులందరికీ ఉచితంగానే వేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ‘ఫ్రీ’ అనే మాటకు నిఘంటువులో ఉన్న అర్థాలు జతచేస్తూ ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని