Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?

ఇంటికి దీపం ఇల్లాలు అంటుంటారు. అలాంటి మహిళకు రాజకీయ రంగ ప్రవేశం కల్పించి, చట్టసభల్లో కాస్త చోటిస్తే.. దేశాన్నీ అభివృద్ధి పథంలో నడిపించగలదు. ఆ చోటు కోసం రూపొందించిందే ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’.

Updated : 20 Sep 2023 12:40 IST

ఇంటికి దీపం ఇల్లాలు అంటుంటారు. అలాంటి మహిళకు రాజకీయ రంగ ప్రవేశం కల్పించి, చట్టసభల్లో కాస్త చోటిస్తే.. దేశాన్నీ అభివృద్ధి పథంలో నడిపించగలదు. ఆ చోటు కోసం రూపొందించిందే ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’. ఎన్నో రద్దులు, మరెన్నో వాయిదాల అనంతరం.. ఎట్టకేలకు ఈ బిల్లును తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఊరిస్తూ వస్తోన్న ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడమే తరువాయి.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లు పూర్వాపరాలేంటి? దీనివల్ల మహిళలకు ఒనగూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

ప్రస్తుతం చాలా రంగాల్లో మహిళలు తమ శక్తియుక్తులతో, తెలివితేటలతో అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. పురుషులకు దీటుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. దేశ రాజకీయాల్లో మాత్రం మహిళల పాత్ర తక్కువే అని చెప్పాలి. ఈ అసమానతల్ని దూరం చేయడానికి రూపొందించినదే ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’.

27 ఏళ్లుగా ఊరిస్తూ..!

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ముఖ్యోద్దేశం. అయితే ప్రస్తుతం చట్టసభల్లో మహిళల శాతం చాలా తక్కువగా ఉందని చెప్పచ్చు. ఇందులో భాగంగా లోక్‌సభలో 542 సీట్లకు గాను 78 మంది మహిళా ఎంపీలుంటే.. అదే రాజ్యసభలో 224 సీట్లలో మహిళలకు కల్పించినవి 24 సీట్లే. ఇలా ఉభయసభల్లో కలుపుకొని 102 మంది మహిళా ఎంపీలున్నారన్నమాట! ఈ లెక్కన పార్లమెంట్‌లో 13.3 శాతం మాత్రమే మహిళలున్నారు. ఈ సంఖ్యను 33 శాతానికి పెంచాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ రిజర్వేషన్‌ బిల్లును రూపొందించారు. నిజానికి ఈ ఆలోచన ఈనాటిది కాదు.. దాదాపు 27 ఏళ్ల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. చివరకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఆపై 2014లో లోక్‌సభ రద్దు కావడంతో మరోసారి బిల్లు అడుగున పడిపోయింది. ఇక తొమ్మిదేళ్ల అనంతరం తాజాగా మరోసారి ఈ బిల్లు తెరమీదకొచ్చింది. అయితే ఈసారి కేబినెట్‌ ఆమోదం తెలపడంతో తాజాగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉభయసభల ఆమోదం పొందాక.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ బిల్లును ‘నారీ శక్తి వందన అధినియ‌మ్’గా పేర్కొన్న ప్రధాని మోదీ.. 2027లో జనగణన పూర్తయ్యాకే ఇది చట్టరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.

చిన్నదేశాలే ఆదర్శం!

ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల శాతం క్రమంగా పెరుగుతుండడం మనం చూస్తున్నాం. ఆయా దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా మహిళలు పగ్గాలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వేదికపై మహిళల శాతం 24.3గా ఉంది. ఇందులోనూ ఒక దేశంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటే.. మరో దేశంలో మరీ తక్కువగా ఉంది. ఈ క్రమంలో రువాండా వంటి చిన్న దేశాలే పెద్ద దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పచ్చు. అక్కడి చట్టసభల్లో మహిళల శాతం 61.25గా ఉండడం విశేషం. ఇక క్యూబా, బొలీవియా.. లాంటి దేశాల్లోనూ 53 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఆయా దేశ రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి హెచ్చుతగ్గులే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ శాసన సభలో అత్యధికంగా 14.44 శాతం మంది మహిళలున్నారు. పశ్చిమబంగ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌.. వంటి రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళల శాతం ఎక్కువగానే ఉంది. అయితే మిజోరం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల్లో అయితే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమీకరణాలు మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రాతినిథ్యం పెరిగితే..?

అయితే మన దేశంలో మహిళలు రాజకీయాల్లోకి రాకపోవడానికి అసమానతలు, సరైన అవకాశాలు దక్కకపోవడమే కాదు.. పలు వ్యక్తిగత కారణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంటి బాధ్యతలతోనే అలసిపోవడం, నాయకత్వ లక్షణాలు లేకపోవడం, పురుషాధిపత్యం.. వంటి పలు అంశాలు వారిని వెనక్కి నెట్టేస్తున్నాయంటున్నారు. వీటన్నింటికీ ఈ బిల్లు పరిష్కార మార్గం చూపుతుందని చెబుతున్నారు. ఇలా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కితే.. ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుంది. ఇలా ఎక్కువమంది మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మహిళలకు స్వతహాగానే ఎక్కువ. దీనివల్ల ఆయా సమస్యలు పరిష్కారమవడంతో పాటు అవినీతిని అంతమొందించడం, సామాజికంగా మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.. వంటివన్నీ మహిళల సారథ్యంలో మరింత ప్రభావవంతంగా పూర్తవుతాయనడంలో సందేహం లేదు. ఇలా ఎలా చూసినా రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగడం వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరే అవకాశాలే ఎక్కువన్నది స్పష్టమవుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్