Egg Freezing: అందుకే ముందు జాగ్రత్తగా అండాల్ని భద్రపరచుకున్నాం!

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్నారు ఈ కాలపు మహిళలు. తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తున్నాయి. కొంతమందిలో పలు అనారోగ్యాల రీత్యా సంతానానికీ....

Published : 07 Apr 2023 12:36 IST

(Photos: Instagram)

(Part-2)

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తున్నారు ఈ కాలపు మహిళలు. తీరా పిల్లల్ని కనాలనుకునే సరికి.. వయసు దాటి పోవడం, అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోవడం.. వంటి సమస్యలొస్తున్నాయి. కొంతమందిలో పలు అనారోగ్యాల రీత్యా సంతానానికీ నోచుకోలేని పరిస్థితి. అలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ పద్ధతి వరంగా మారిందని చెప్పచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన/నాణ్యమైన అండాల్ని శీతలీకరించుకొని.. ఆపై నచ్చినప్పుడు పిల్లల్ని కనే ఈ పద్ధతిని తానూ పాటించానని ఇటీవలే వెల్లడించింది గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా. గతేడాది జనవరిలో సరోగసీ విధానంలో మాల్తీ అనే పాపకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. ఇందుకోసం తాను తన 30 ఏళ్ల వయసులో శీతలీకరించిన అండాల్నే వాడానంటోంది. పీసీనే కాదు.. మరికొందరు తారలూ ఈ విధానాన్ని అనుసరించి అమ్మలయ్యారు. మరి, వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

మానసికంగా సిద్ధపడ్డాకే..!

తన నటనతో అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల తార మోనా సింగ్‌. 2019లో దర్శకనిర్మాత రాజగోపాలన్‌ను వివాహమాడిన ఆమె.. తాను కూడా తన 34 ఏళ్ల వయసులో అండాల్ని శీతలీకరించుకున్నానని ఓ సందర్భంలో బయటపెట్టింది.

‘ఎగ్‌ ఫ్రీజింగ్‌తో నాకు స్వేచ్ఛ లభించినట్లయింది. నా 34 ఏళ్ల వయసులోనే నేను ఈ పద్ధతిని అనుసరించి నా అండాల్ని భద్రపరచుకున్నా. కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఆనందించాలనుకుంటున్నా. కుటుంబం, స్నేహితులతో ప్రపంచమంతా చుట్టిరావాలనుంది. పిల్లలంటే నాకూ ఇష్టమే! కానీ ప్రస్తుతం నేను అందుకు మానసికంగా సిద్ధపడలేదు. అయితే నేను అండాల్ని శీతలీకరించుకుంటానంటే అమ్మ సంతోషించింది. నాతో పాటు ఆస్పత్రికి వచ్చింది. ఈ పద్ధతి పూర్తి కావడానికి నాకు ఐదు నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో పలు మానసిక ఒత్తిళ్లనూ ఎదుర్కొన్నా..’ అంటూ తన ఎగ్‌ ఫ్రీజింగ్‌ అనుభవాల్ని పంచుకుంది మోనా.


అప్పుడు చాలా బరువు పెరిగా!

బాలీవుడ్‌ అందాల తార కాజోల్ చెల్లెలిగానే కాకుండా.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తనీషా ముఖర్జీ. ఇటీవలే 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 39 ఏళ్ల వయసులో తన అండాల్ని భద్రపరచుకున్నానంటోంది. అంతేకాదు.. ఈ క్రమంలో పలు సమస్యలూ ఎదురయ్యాయంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది తనీషా.

‘33 ఏళ్లున్నప్పుడు నేను అండాల్ని భద్రపరచుకోవాలనుకున్నా. కానీ పలు కారణాల వల్ల డాక్టర్‌ అందుకు ఒప్పుకోలేదు. కానీ 39 ఏళ్ల వయసులో ఇది సఫలీకృతమైంది. అయితే ఈ క్రమంలో చాలా బరువు పెరిగిపోయా. హార్మోన్‌ ఇంజెక్షన్ల కారణంగా శరీరం ఉబ్బినట్లుగా తయారైంది. ఏదేమైనా నా అండాల్ని భద్రపరచుకున్నందుకు సంతోషంగా ఉంది..’ అంది తనీషా.


తొమ్మిదిలో ఐదు ఆరోగ్యంగా..!

రాఖీ సావంత్‌ను బాలీవుడ్‌లో వివాదాస్పద క్వీన్‌గా పిలుస్తారు. తన విభిన్న లైఫ్‌స్టైల్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మూడేళ్ల క్రితం నిర్వహించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ -14’ కార్యక్రమంలో భాగంగా తన ఎగ్‌ ఫ్రీజింగ్‌ గురించి బయటపెట్టింది.
‘ఒక వయసొచ్చాక పిల్లల్ని వాయిదా వేయాలన్న ఆలోచన ఉంటే మాత్రం వెంటనే ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని ఆశ్రయించడం ఉత్తమం. నేనూ కొన్నేళ్ల క్రితం ఈ పద్ధతి ద్వారానే నా అండాల్ని భద్రపరచుకున్నా. ఈ క్రమంలో డాక్టర్ తొమ్మిది అండాల్ని సేకరించగా.. అందులో ఐదు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. వాటినే శీతలీకరించారు..’ అంటూ చెప్పుకొచ్చింది రాఖీ.

గమనిక: ఈ ఆర్టికల్ మొదటి భాగం కోసం కింది లింక్ క్లిక్ చేయండి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్