భయపడకండి... తరిమేద్దాం

కొత్తదనమంటే భయం.. వైఫల్యమంటే భయం! నచ్చిందనో, నచ్చలేదనో చెప్పడానికీ భయం! ఈ భయం..  మనకు అడుగడుగునా పరిచయమే! మరి.. ఒళ్లంతా చెమటలు, ఆందోళనతో చిగురుటాకులా వణకడం, ఊపిరి పట్టేసినట్లు..

Updated : 30 Oct 2022 08:44 IST

కొత్తదనమంటే భయం.. వైఫల్యమంటే భయం! నచ్చిందనో, నచ్చలేదనో చెప్పడానికీ భయం! ఈ భయం..  మనకు అడుగడుగునా పరిచయమే! మరి.. ఒళ్లంతా చెమటలు, ఆందోళనతో చిగురుటాకులా వణకడం, ఊపిరి పట్టేసినట్లు.. ప్రాణం పోతుందేమోనన్నంత భావన ముందు? ఇది చిన్నగానే అనిపిస్తోందా! ఫోబియాగా పిలిచే దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు వీళ్లు.. వీళ్ల స్ఫూర్తితో భయాన్ని తరిమేద్దాం!


చీకటితో యుద్ధం

తెరపై వీరోచిత పాత్రల్లో ఆలియా భట్‌ను చూస్తుంటాం! కొత్త ప్రయత్నాలకి ముందుండే తనకు చీకటంటే భయం. దీన్ని నిక్టోఫోబియా అంటారు. చిన్నతనంలో తనని ఆటపట్టిద్దామని వాళ్లక్క చీకటి గదిలో ఉంచి గడియ పెట్టేసింది. చాలాసేపటికి గానీ ఆ విషయం గుర్తురాలేదట. ఆలియానేమో ఏడ్చి భయంతో బిగుసుకుపోయిందట. దానివల్లే తనకు  చీకటంటే భయం. లైట్లు ఉంటేగానీ నిద్రపోదు. కానీ దాన్ని ఎదుర్కోవాలనుకుంది. గదిలో లైట్లు ఆర్పేసి పడుకోవడానికి ప్రయత్నిస్తుందట. కిటికీ కర్టెన్లు మాత్రం తెరిచే ఉంచుతుంది. ఆలియాకి వైఫల్యమన్నా భయమేనట. అందుకే ఎక్కువ కష్టపడేదట. ఒకటికి రెండుసార్లు ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోదు. అయితే ఒక వైఫల్యం నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నానని చెబుతోంది. ఇప్పుడు ఫలితం గురించి కంగారుపడక, తన ప్రయత్నం తను చేయడానికే ప్రాధాన్యమిస్తోంది.


నటించి మరీ..

కాజల్‌కి పక్షులంటే భయం. ఈ ఆర్నిథోఫోబియాను దూరం చేసుకోవడానికి మారి, టెంపర్‌ సినిమాల్లో పక్షులతో నటించింది. ఓటీటీల ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్‌కి దెయ్యాలంటే భయమట. ఈ ఫాస్మో ఫోబియాని పోగొట్టుకోవడానికే హారర్‌ సినిమాల్లో నటిస్తున్నానని చెబుతోంది. తారలన్నాక ప్రచార కార్యక్రమాలు, అభిమానులను కలవడం సాధారణం. కానీ జన సమూహాలంటే శ్రియా శరన్‌కి భయమట. ఎక్కడ చెడుగా పట్టుకుంటారో, ప్రవర్తిస్తారో అని విపరీతమైన ఆందోళన. దీన్నే అఫెన్ఫోజమ్‌ ఫోబియా అంటారు. అందుకే సాధ్యమైనంత వరకూ అలాంటి చోట్లకు వెళ్లదట. తప్పదనుకుంటే భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూసుకుంటుందట.


ఒకటి ఎదుర్కొని..

శ్రుతిహాసన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. విమర్శలను ఎదుర్కోవడంలోనే కాదు తన మానసిక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటానికీ వెనకాడదు. తనకు ఒఫిడియో ఫోబియా. పురుగులు, బల్లులు, పాములంటే విపరీతమైన భయం. వాటి పేరు విన్నా వణికిపోతుంది. అవెక్కడ వస్తాయోనని సరిగా నిద్ర కూడా పోదట. శ్రుతికి ఎత్తైన ప్రదేశాలన్నా భయమే. అలాంటి చోట్లకు వెళ్లినప్పుడు కళ్లు తిరిగి పడిపోతుందట. దాన్ని పోగొట్టుకోవడానికి ఓ హిందీ సినిమా కోసం ఎత్తైన ప్రదేశాల నుంచి స్టంట్‌లు చేసింది. ప్రస్తుతం ఒఫిడియో ఫోబియాను పోగొట్టుకోవడానికీ ప్రయత్నిస్తోంది. చాలా కష్టంగా ఉన్నా సాధిస్తానంటోంది.


ఇదీ మానసిక సమస్యే!

జ్వరమైతే బయటికి తెలుస్తుంది. భయం ఎవరికి కనిపిస్తుంది? ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం సహజమేనన్న అభిప్రాయంతో చాలా మంది ఫోబియాల చికిత్సకి ముందుకు రారు. తప్పించుకు తిరుగుతారు. కానీ దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు? ఆందోళన, విపరీతమైన భయానికి గురవుతారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ ఇబ్బంది పడాలి. కొన్నిసార్లు ఒక భయం ఇంకెన్నింటికో దారి తీయొచ్చు. భయపడేది దగ్గర్లో ఉన్నా నాకేమీ కాదన్న ధైర్యం వచ్చినపుడు బయటపడటం సాధ్యం. అందుకు నిపుణుల సాయం తప్పనిసరి. ఇదీ మానసిక సమస్యే. చికిత్స ద్వారా తేలిగ్గా బయటపడొచ్చు. ఉదాహరణకు చాలామంది బల్లి అంటే భయపడతారు. దాని పుట్టుక నుంచి అదెలా ప్రమాదకరం కాదన్న విషయాలు చెబుతూనే అపోహలను పోగొడతాం. అన్ని భయాలకూ మందులు అవసరం లేదు. 80% వరకూ కౌన్సెలింగ్‌ ద్వారానే తగ్గించొచ్చు. ఎదుర్కోవడానికి ముందుకు రావడం ప్రధానం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్