అమ్మ.. ఆఫీసు.. ఎలా?
అప్పటిదాకా ఉన్న బాధ్యతలు అమ్మయ్యాక ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. ఆఫీసు, ఇల్లు.. సరిగా సమన్వయం చేసుకుంటే సరే! తేడా వస్తేనే కెరియర్‌ని పక్కన పడేయాల్సి వస్తుంది.
Published : 08 Aug 2023 02:11 IST
అప్పటిదాకా ఉన్న బాధ్యతలు అమ్మయ్యాక ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. ఆఫీసు, ఇల్లు.. సరిగా సమన్వయం చేసుకుంటే సరే! తేడా వస్తేనే కెరియర్‌ని పక్కన పడేయాల్సి వస్తుంది. కాబట్టి..
- చాలా వరకూ పాపాయికి ఇబ్బంది అవుతోంది అని మాత్రమే ఆలోచిస్తాం. దీంతో లక్ష్యాలన్నీ పక్కకి వెళ్లిపోతాయి. అలాకాకుండా వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మీరు చేయాల్సినవేంటో పేపర్‌పై పెట్టండి. కాగితాన్ని రెండు కాలమ్‌లుగా విభజించి, పక్కపక్కనే రాయండి. ఇంటిపనుల కారణంగా పాపాయితో గడపలేకపోతున్నా అనిపించింది అనుకోండి.. పనిమనిషిని పెట్టుకోవచ్చేమో ఆలోచించండి. పనివేళల్లో మార్పు.. ఇలా ఏమేం ఉపాయాలున్నాయో చెక్ చేసుకుంటే ‘రాజీనామా’నే పరిష్కారంగా కనిపించదు.
- చిన్నారి రోజువారీ పనులే కాదు.. ఆరోగ్యం బాగోకపోతే బాగోగులు చూసుకోవాల్సిందీ మనమే అన్న భావన మనసు లోతుల్లో పాతుకుపోయింది. ఇబ్బందిగా ఉన్నా.. ‘మగవాళ్లకేం తెలుసు’, ‘చెబితే బాగోదు’ అనుకుంటూ మౌనంగా చేసుకుంటూ వెళతాం. మీతోపాటు భాగస్వామికీ సమాన బాధ్యత ఉంటుంది. నోరు తెరిచి పంచుకోమని అడగండి. అప్పుడే భారం పూర్తిగా మీమీదే పడకుండా ఉంటుంది.
- అడగందే అమ్మయినా పెట్టదు. మీ ఇబ్బందేంటా అని ఎవరూ అడగరు. కాబట్టి, ఆఫీసులోనూ మీ అవసరాలతోపాటు, పైవాళ్ల నుంచి ఏ సాయం కావాలో అడగండి. ఇంటి నుంచి పనిచేసే వీలు, సమయ వేళల్లో మార్పులు, హైబ్రిడ్ వర్క్‌ల్లో మీకు అనువైనదాన్ని అడగండి. అర్థం చేసుకుంటారు.
- ఇంటికొచ్చాకా ఆఫీసు పనిలో పడితేనే ‘నిర్లక్ష్య’ భావన ఎదురయ్యేది. ఇంటికొచ్చాక అందుబాటులో ఉండనన్న విషయాన్ని స్పష్టం చేస్తే తోటి ఉద్యోగులూ మిమ్మల్ని కదిలించరు. మరీ అవసరమైతే తప్ప చేయలేనని చెబితేనే పనికీ, ఇంటికీ మధ్య సరైన సరిహద్దులు గీసిన వారవుతారు.
- ఇల్లు, ఆఫీసంటూ ఎంతసేపూ బాధ్యతల మధ్య నలిగిపోతే ఒత్తిడేగా! ఇదీ అలసిపోయామన్న భావనను కలిగిస్తుంది. కాబట్టి.. మీపైనా శ్రద్ధ పెట్టండి. ధ్యానం, నచ్చిన వ్యాపకాలు ప్రయత్నించడం, పాటలు వినడం వంటివి చేయండి. లేదంటే ఆ విసుగు కాస్తా పాపాయి మీద చూపెడితే మళ్లీ మీరే బాధపడాలి. అలా జరగొద్దన్నా స్వీయ శ్రద్ధ కావాల్సిందే.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.