అది అతి అయ్యిందేమో!

బరువు పెరిగితే ఎక్కువ తినేస్తున్నామేమో అన్న కంగారు. నిద్ర పట్టకపోతుంటే ముందే మెనోపాజ్‌ వస్తోందేమో అన్న భయం. గాయాలు మానకపోతే మధుమేహమేమో... ఇలా అనుమానించుకుంటూ పోతుంటాం.

Published : 09 May 2024 03:13 IST

బరువు పెరిగితే ఎక్కువ తినేస్తున్నామేమో అన్న కంగారు. నిద్ర పట్టకపోతుంటే ముందే మెనోపాజ్‌ వస్తోందేమో అన్న భయం. గాయాలు మానకపోతే మధుమేహమేమో... ఇలా అనుమానించుకుంటూ పోతుంటాం. అయితే ఒత్తిడి కలిగించే హార్మోను పెరిగిందేమో గమనించుకోమంటున్నారు నిపుణులు.

మెటబాలిజం సరిగా ఉండాలన్నా... రక్తంలో చక్కెరలు, హార్మోన్ల స్థాయుల్లో సమన్వయం జరగాలన్నా కాస్త ఒత్తిడి మంచిదే. అంటే దానికి కారణమయ్యే కార్టిసాల్‌ కొద్దిస్థాయుల్లో విడుదలైతే ఆరోగ్యమే... అది హద్దు దాటితేనే అనారోగ్యం. ‘పొట్ట పెరిగిపోతోంది. దుస్తుల్లోంచి కనిపిస్తోంద’ంటూ తెగ ఇబ్బంది పడిపోతాం కదా! అది పెరుగుతూ వస్తోన్నా అనుమానించాల్సిందే. ఒత్తిడితో తెలియకుండానే స్వీట్లు, చిరుతిళ్లవైపు ఆకర్షితులం అవుతాం. అదేమో బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరిగేకొద్దీ శరీరంలో నిల్వ ఉండే గ్లూకోజు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అదీ పొట్ట దగ్గర కొవ్వుగా చేరుతుందట.

  • రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం, పట్టినా పదే పదే మెలకువ రావడమూ కార్టిసాల్‌ పెరగడానికి సూచనలే. పదే పదే ముఖం వాయడం, నీరు చేరినట్లుగా అనిపించినా తేలిగ్గా తీసుకోవద్దు. అంతెందుకు, శరీరంపై ఏవైనా గాయాలైతే కొన్నిరోజుల్లో మానడం మామూలే. గాయం తీవ్రతను బట్టి నయమయ్యే సమయంలో మార్పు ఉంటుంది. చిన్నచిన్నవీ త్వరగా తగ్గడం లేదంటే దానికి కారణమయ్యే సైటోకైన్స్‌ సరిగా పనిచేయడం లేదని అర్థం. పెరిగిన ఒత్తిడి హార్మోన్‌ ఉత్పత్తి సైటోకైన్స్‌ పనితీరుకు అడ్డుపడి, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమవుతాయి.
  • తిండి పడలేదు, జీర్ణవ్యవస్థలో ఏదో ఇబ్బంది... గ్యాస్‌ పదే పదే పలకరిస్తోంటే మనం చెప్పుకొనే కారణాలే ఇవి. కొన్నిసార్లు నెలసరి రాబోతోందని సర్దిపుచ్చుకుంటాం కూడా. కానీ అతి ఒత్తిడి కూడా జీర్ణప్రక్రియపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, కారణాలు వెతుక్కుంటూ వెళ్లడంతో సరిపుచ్చుకోవద్దు. శరీరం ఇచ్చే సూచనలను గమనించుకోండి. వీటిలో ఏ రెండు, మూడు లక్షణాలు కనిపించినా ఒత్తిడి మీపై భారం పెంచుతోందని అర్థం చేసుకోవాలి. ఆపై ధ్యానం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించే ఇతర వ్యాపకాలపైనా దృష్టిపెట్టాలి. అవసరమైతే నిపుణుల సలహానీ తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్