Jr NTR: వాళ్లే నా ‘వండర్‌ విమెన్’!

కెరీర్‌లో ఎదగాలంటే సంబంధిత రంగంలో నైపుణ్యాలుంటే సరిపోదు.. ఇంటి నుంచీ తగిన ప్రోత్సాహం అందాలి. మహిళలకే కాదు.. మగవారికీ ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో తానెంతో అదృష్టవంతుడిని అంటున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌.

Updated : 16 Mar 2024 14:58 IST

కెరీర్‌లో ఎదగాలంటే సంబంధిత రంగంలో నైపుణ్యాలుంటే సరిపోదు.. ఇంటి నుంచీ తగిన ప్రోత్సాహం అందాలి. మహిళలకే కాదు.. మగవారికీ ఇది వర్తిస్తుంది. ఈ విషయంలో తానెంతో అదృష్టవంతుడిని అంటున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌. తెలుగు చిత్ర పరిశ్రమలో తానో టాప్‌ హీరోగా రాణించడంలో ఇద్దరు మహిళల పాత్ర కీలకమని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఎన్టీఆర్‌ను వాళ్లెలా ప్రభావితం చేశారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

సీనియర్‌ ఎన్టీఆర్‌ మనవడిగా తెలుగు తెరకు పరిచయమైనా.. ఆయన పేరు ప్రఖ్యాతులతో కాకుండా సొంతంగా గుర్తింపు సంపాదించుకోవాలనుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. కెరీర్‌ ప్రారంభంలో పలు వైఫల్యాలు ఎదురైనా, సవాళ్లు అడ్డుపడినా.. వాటిని అధిగమించి మరీ తన నట ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడీ హ్యాండ్‌సమ్‌. ప్రతి సినిమాలో కొత్తదనం ఉట్టిపడే పాత్రల్ని ఎంచుకునే ఈ హీరో.. ఈ క్రియేటివిటీ తన తల్లి ద్వారానే తనకు అబ్బిందని ఓ సందర్భంలో పంచుకున్నాడు.

అమ్మ వల్లే డ్యాన్సర్‌నయ్యా!

‘నా జీవితంలో స్ఫూర్తి నింపిన మహిళల్లో మా అమ్మ షాలిని నందమూరి ఒకరు. చిన్నతనం నుంచి నా ప్రతి అడుగులోనూ తను నన్ను ప్రోత్సహించింది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోమని వెన్నుతట్టేది. ఇవే నా కెరీర్‌కు బంగారు బాట వేస్తాయని చెబుతుండేది. ఇలా అమ్మ మాటలే నేను సినిమాల్లో విభిన్న పాత్రలు ఎంచుకునేందుకు దోహదం చేస్తున్నాయి. నేను శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనేది అమ్మ కోరిక. తన ఇష్టప్రకారమే చిన్నతనంలో నేను డ్యాన్స్‌ నేర్చుకున్నా. ఈ క్రమంలోనే కళలకు స్త్రీపురుష భేదాల్లేవన్న విషయమూ అమ్మ ద్వారానే నాకు అర్థమైంది. ఈ ప్రపంచం నన్నో నటుడిగానే కాదు.. ఓ మంచి డ్యాన్సర్‌గానూ గుర్తించిందంటే అదంతా అమ్మ చలవే! నా 17 ఏళ్ల వయసులో సినిమాల్లోకొచ్చా. నాటి నుంచి నేటి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు నా నటనను, డ్యాన్సింగ్‌ నైపుణ్యాల్ని ఎంజాయ్‌ చేశా. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటలో నేను చేసిన డ్యాన్స్‌కు ఎంతోమంది నుంచి ప్రశంసలు దక్కాయంటే అదీ అమ్మ వల్లే! మన ఆలోచనల్ని, భావాల్ని వ్యక్తం చేయడానికి డ్యాన్స్‌ ఓ మార్గమనేది నా అభిప్రాయం..’ అంటాడీ ట్యాలెంటెడ్‌ హీరో.

తనే నా వండర్‌ ఉమన్!

తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో తన తల్లి పాత్ర ఎంత ఉందో.. తన భార్య లక్ష్మీ ప్రణతి పాత్ర కూడా అంతే ఉందంటున్నాడు యంగ్‌ టైగర్‌. చిన్నతనంలో హైపర్‌ బాయ్‌గా ఉన్న తనను హోమ్లీ మ్యాన్‌గా మార్చిన ఘనత తన భార్యదేనంటూ ఆమె తనలో స్ఫూర్తి రగిలించిన తీరును ఓ సందర్భంలో ఇలా పంచుకున్నాడు ఎన్టీఆర్.

‘చిన్నతనంలో నేను హైపర్‌గా ఉండేవాడిని. అలాంటి నేను కూల్‌గా, హోమ్లీ మ్యాన్‌గా మారానంటే అదంతా నా భార్య లక్ష్మీ ప్రణతి వల్లే సాధ్యమైంది. నేనో వండర్‌ఫుల్‌ ఉమన్‌ని పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ ఫీలవుతుంటా. సినిమాల్లో ఎంచుకునే పాత్రల గురించీ తను నాకు కొన్ని సలహాలిస్తుంటుంది. ఈ తరం అమ్మాయిలు ఎలాంటి లీడ్‌ రోల్స్‌ని ఇష్టపడుతుంటారో చెబుతుంటుంది. ఇలా ఆమె సలహాలు నేను సినిమాల్లో పాత్రల్ని ఎంచుకోవడానికి, ఉత్తమంగా నటించడానికి దోహదపడుతుంటాయి. తన ఇష్టాల్ని నాపై రుద్దాలని ప్రణతి ఎప్పుడూ అనుకోదు.. నేను నేనుగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇక మానసికంగా తను నాకంటే స్ట్రాంగ్‌. అంతేకాదు.. తనే నా ఫిట్‌నెస్‌ బడ్డీ కూడా! నేను ఒక్క రోజు కూడా వ్యాయామం మానకుండా నన్ను ప్రోత్సహిస్తుంటుంది.. తను పిల్లలతో ఎంత బిజీగా ఉన్నా నాతో కలిసి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంది. ఇక మా అమ్మ, ప్రణతి.. ఇద్దరూ సినిమా లవర్సే! అయితే అమ్మ పాత సినిమాలు చూడ్డానికి ఇష్టపడితే.. నా భార్య కొత్త సినిమాలు చూడ్డానికి మక్కువ చూపుతుంది..’ అంటూ తన ముద్దుల భార్య గురించి పంచుకున్నాడీ టాలీవుడ్‌ స్టార్‌ హీరో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్