Amitabh Bachchan: ఆమె కంటే అందగత్తె లేదు.. తనే నా రోల్‌మోడల్!

కష్టాలు, కన్నీళ్లు ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. వాటినే తలచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం.. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే గొప్పోళ్లవుతారు.. నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!

Updated : 16 Mar 2024 15:12 IST

కష్టాలు, కన్నీళ్లు ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. వాటినే తలచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం.. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే గొప్పోళ్లవుతారు.. నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! బొగ్గు గనుల్లో చిరు ఉద్యోగిగా పనిచేసిన ఆయన.. సినిమాలపై మక్కువతో వెండితెరపైకొచ్చారు. అక్కడా ఆయనకు వరుసగా తిరస్కరణలే స్వాగతం పలికాయి.. విమర్శలే హారతి పట్టాయి. అయినా నిలదొక్కుకొని ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌నే శాసించే స్థాయికి ఎదిగారు. ఈ ఎదుగుదలకు కారణమైన వ్యక్తి ఎవరో, తన జీవితానికి అసలు సిసలైన స్ఫూర్తి ప్రదాత ఎవరో ఓ సందర్భంలో పంచుకున్నారాయన.

అమ్మ ఆశీర్వాద బలం!

ప్రతి ఒక్కరికీ జీవితంలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఎవరో ఒకరుంటారు. అలా తన జీవితానికి ఒకరు కాదు.. ఇద్దరు మార్గదర్శకులున్నారంటున్నారు బిగ్‌బీ. వారిలో తన తల్లి తేజీ బచ్చన్‌ ఒకరని చెబుతున్నారు.

‘నా జీవితానికి నా తల్లే అతి పెద్ద స్ఫూర్తి. ఆమెకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఎలాంటి ఎమోషన్‌నైనా అదుపు చేసుకొని.. పైకి నవ్వుతూ కనిపించడం ఆమెకే చెల్లింది. నా కెరీర్‌ ఒడిదొడుకుల్లో ఉన్నప్పుడు నాలో ధైర్యం నూరిపోసింది. సినిమాల్లోకొచ్చిన తొలినాళ్లలో వరుస తిరస్కరణలు, వరుస వైఫల్యాలతో ప్రశ్నార్థకంగా మారిన నా జీవితాన్ని తిరిగి గాడిలో పడేసిన మార్గదర్శకురాలామె. ఈ క్రమంలో నేను బాధలో ఉన్న ప్రతిసారీ నా పక్కనే కూర్చొని ‘అంతా మంచే జరుగుతుంది’ అని నాలో ధైర్యం నూరిపోసేది. నాన్న పక్కన కూర్చొని తానిచ్చే ఆశీర్వాదాలు నాలో మనోబలాన్ని రెట్టింపు చేసేవి. తాను దూరమై 17 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆమె ఆశీర్వచనాలు నా వెన్నంటే ఉన్నాయనిపిస్తుంటుంది. అమ్మ అందమైన ముఖమే నా కళ్ల ముందు కదలాడుతుంటుంది. ఈ సృష్టిలో అందరి కంటే అందమైన వ్యక్తి ఎవరంటే అమ్మ పేరే చెప్తా..’ అంటూ తన తల్లి గురించి ఓ సందర్భంలో గుదిగుచ్చాడీ బాలీవుడ్‌ మెగాస్టార్.

అదీ ఆమె అంకితభావం!

తన జీవితానికి స్ఫూర్తి ప్రదాత తన తల్లైతే.. వెండితెరపై తనలో ప్రేరణ కలిగించిన వ్యక్తి అలనాటి బాలీవుడ్‌ నటి వహీదా రెహ్‌మాన్‌ అంటున్నారు అమితాబ్.

‘నా దృష్టిలో స్ఫూర్తి ఒకే రంగానికి పరిమితం కాదు.. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు మనలో ప్రేరణ కలిగించచ్చు. అలా వెండితెరపై నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకరు - దిలీప్‌ కుమార్‌, మరొకరు - వహీదా రెహ్‌మాన్‌. అందుకూ ఓ ఉదాహరణ చెప్తా. ‘రేష్మా ఔర్‌ షేర్షా’ సినిమాలో తొలిసారి వహీదా జీతో కలిసి నటించే అవకాశమొచ్చింది. ఈ క్రమంలోనే ఓసారి ఎడారిలో షూటింగ్‌ ఏర్పాటుచేశారు. కాళ్లకు చెప్పుల్లేకుండా ఇసుకపై నటించే సీన్‌ అది. తీవ్రమైన వేడిలో క్షణం కూడా నిలవలేని పరిస్థితి. అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని సీన్‌ పండించారు వహీదా. అలా పనిపై ఆమెకున్న అంకితభావమే నాలో స్ఫూర్తి రగిలించింది.. ఆమెపై అభిమానం రెట్టింపయ్యేలా చేసింది. ఆమె ఓ మంచి నటి మాత్రమే కాదు.. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. మీకు మరో ఆసక్తికర విషయం చెప్పనా? మా కుటుంబంలో ముగ్గురితో కలిసి నటించారు వహీదా. ‘ఫాగున్‌’ అనే సినిమాలో నా భార్య జయకు తల్లిగా, ‘ఓమ్‌ జయ్‌ జగదీశ్‌’లో నా కొడుకు అభిషేక్‌కు తల్లిగా, ఇక నాతోనూ పలు సినిమాల్లో నటించారు..’ అంటూ అలనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారీ బాలీవుడ్‌ లెజెండ్‌. వీళ్లిద్దరే కాదు.. తన కూతురు శ్వేతా నందా, మనవరాళ్లు నవ్య, ఆరాధ్యల్ని తలచుకుంటూ పలుమార్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతుంటారు అమితాబ్.

Narendra Modi: నన్నో వ్యక్తిగా, శక్తిగా మలిచింది తనే!

Anand Mahindra: ఆమె జీవితమే నాకు స్ఫూర్తి!

ఆ ఇద్దరే నా ‘సూపర్ విమెన్’!



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్