రాత్రుళ్లు ఇంటికి రావడం లేదు.. ఏం చేయాలి?

మా అమ్మాయి వయసు 19 ఏళ్లు. డిగ్రీ చదువుతోంది. తనకు కాలేజీలో స్నేహితుల సంఖ్య ఎక్కువైంది. ఒక్కోసారి రాత్రుళ్లు కూడా తన స్నేహితురాళ్ల ఇళ్లల్లో ఉండిపోతోంది. నేను ఎంత వద్దని చెప్పినా నా మాట వినడం లేదు.

Published : 16 Feb 2024 21:40 IST

మా అమ్మాయి వయసు 19 ఏళ్లు. డిగ్రీ చదువుతోంది. తనకు కాలేజీలో స్నేహితుల సంఖ్య ఎక్కువైంది. ఒక్కోసారి రాత్రుళ్లు కూడా తన స్నేహితురాళ్ల ఇళ్లల్లో ఉండిపోతోంది. నేను ఎంత వద్దని చెప్పినా నా మాట వినడం లేదు. ‘అమ్మాయిల ఇళ్లల్లోనే ఉంటున్నాను కదా’ అని వాదిస్తోంది. ఈ విషయంలో చాలా మొండిగా ఉంటోంది. ‘ఎవరి ఇంట్లో ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు కదా’ అంటే వినిపించుకోవడం లేదు. తను నా మాట వినాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ అమ్మాయి యుక్త వయసులోకి అడుగుపెడుతోంది. ఈ వయసులో వారికంటూ కొన్ని సొంత ఆలోచనలను ఏర్పరచుకుంటారు. ‘నేను చేసేదే కరెక్ట్‌’ అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వారి ధోరణిని బలంగా వ్యతిరేకిస్తే మరింత మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆలోచనలు, పద్ధతులను వెంటనే వ్యతిరేకించకపోవడం మంచిది. దీనికి బదులుగా అందులో ఉండే ప్రమాదాల గురించి తనకు నిదానంగా చెప్పడానికి ప్రయత్నించండి. తను వాటి గురించి తేలిగ్గా కొట్టిపడేయకుండా అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఎంత అవసరమో తెలియజేయండి. అలా కాకుండా ‘ఇంట్లోనే ఉండాలి.. నా మాటే వినాలి.. బయటకు వెళ్లకూడదు’ వంటి నిబంధనలు పెట్టడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈ వయసులో వారు సాహసాలు చేయడాన్ని ఒక లైఫ్‌స్టైల్‌గా భావిస్తుంటారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లడం, పార్టీలు జరుపుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి వారిని ఆపడం కష్టమైన విషయం. ఏ సమస్య అయినా సరే పూర్తిగా నిర్మూలించడం కంటే నివారించడం సులభం. ఇదే పద్ధతిలో మీ అమ్మాయిని పూర్తిగా నియంత్రించకుండా.. తన పనులకు మద్దతు ఇస్తూనే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి. ఇలా చేయడం వల్ల తన కోసం మీరు పడే బాధను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రిస్క్‌ ఉంటే తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, తన వైపు నుంచి ఆలోచించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్