ఎవరికి ఏ పాలు మంచివి?

మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి. పాలు తాగడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగంగా ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పాలలో అధిక శాతంలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి.

Updated : 03 Feb 2022 21:14 IST

మనకుండే నిత్యావసర వస్తువుల్లో పాలు కూడా ఒకటి. పాలు తాగడం ద్వారా మన శరీరానికి అధిక మొత్తంలో పోషకాలు అందుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగంగా ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పాలలో అధిక శాతంలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలు పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలకు పాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. అందుకే ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా మందులతో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్‌లో మనకు రకరకాల పేర్లతో పాలు లభిస్తున్నాయి. వివిధ డెయిరీ సంస్థలు 'ఫుల్ క్రీమ్ మిల్క్', 'టోన్డ్ మిల్క్', 'క్రీమ్‌లెస్ మిల్క్'.. మొదలైన పేర్లతో పాల ప్యాకెట్లను మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో కొన్ని పిల్లలకు ఉపయోగకరమైనవి అయితే.. మరికొన్ని గర్భిణి స్త్రీలకు, పోషకాహారలోపం ఉన్నవారికి మేలు చేసేవి. మరి, వీటిలో ఏ రకం పాలు.. ఎవరెవరికి ఉపయోగకరమో తెలుసుకుందాం..!

ఒక వయసు వచ్చాక పాలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. పాలు తాగితే త్వరగా జీర్ణమవ్వదు..! దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి భవిష్యత్తులో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఇలా పాల విషయంలో చాలామందికి చాలారకాల అభిప్రాయాలుంటాయి. వాటిల్లో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ మార్కెట్‌లో లభించే పాలన్నీ ఒకే రకానికి సంబంధించినవి కావు. మరి వివిధ పేర్లతో లభించే పాల మధ్య తేడాలేంటో మీరూ చూడండి..!

స్కిమ్డ్ మిల్క్

పాలలో సహజంగా ఉండే కొవ్వును (క్రీమ్ అని అంటారు) తీసేసిన పాలను 'స్కిమ్డ్ మిల్క్' లేదా 'నో-ఫ్యాట్ మిల్క్' అని పిలుస్తుంటారు. ఇందులో కేవలం 0.3% మాత్రమే కొవ్వు ఉంటుంది. పాలు తాగడం వల్ల అధిక బరువు సమస్య వస్తుందని భావించే వారు ఈ రకం పాలను తీసుకోవచ్చు. తమ రెగ్యులర్ డైట్‌లో భాగంగా రోజూ ఒక గ్లాస్ పాలు తీసుకున్నట్లయితే అది తమ శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది.

ఫుల్ క్రీమ్ మిల్క్

పాలల్లో నుంచి కొవ్వు పదార్ధాలను వేరు చేయకుండా అలానే ఉంచితే వాటిని 'హోల్ మిల్క్' లేదా 'ఫుల్ క్రీమ్ మిల్క్' అని అంటారు. వీటిలో 3.5% కొవ్వు ఉంటుంది. సాధారణంగా మనిషి మెదడు పరిపూర్ణంగా ఏర్పడడానికి 60% కొవ్వు అవసరం. అందుకే ఎదిగే క్రమంలో చిన్న పిల్లలకు పాలు చాలా అవసరమని చెబుతుంటారు వైద్యులు. అంతేకాకుండా పాల ద్వారా లభించే పోషకాలు శరీర ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. దీంతో పాటు పాల ద్వారా మన శరీరానికి విటమిన్ డి, ఎ, బి1, క్యాల్షియం, ఫాస్ఫరస్, రైబోఫ్లేవిన్.. మొదలైనవి లభిస్తాయి. 'ఫుల్ క్రీమ్' రకం పాలను చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే క్రమంలో ఉన్న తల్లులు, శరీర బరువు పెరగాలని కోరుకునేవారు తీసుకోవచ్చు.

టోన్డ్ మిల్క్

మామూలు పాలల్లో స్కిమ్డ్ పాల పౌడర్, నీళ్లు కలిపితే దాన్ని 'టోన్డ్ మిల్క్' అని అంటారు. ఇలా చేయడం వల్ల సాధారణంగా పాలల్లో ఉండే 9-10% కొవ్వు శాతం 3 శాతానికి తగ్గుతుంది. ఈ రకం పాలల్లో అధిక పోషక విలువలు ఉండడమే కాకుండా.. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. గర్భిణీ స్త్రీలు, పోషకాహార లోపంతో బాధపడేవారు ఈ రకం పాలను తీసుకోవచ్చు.

డబుల్ టోన్డ్ మిల్క్

టోన్డ్ మిల్క్ పద్ధతిలోనే ఈ రకం పాలను తయారు చేస్తారు. కాకపోతే ఈ రకం పాల తయారీలో ప్యాశ్చరైజేషన్ పద్ధతిని కూడా ఉపయోగిస్తారు. ప్యాశ్చరైజేషన్ అంటే పాలను 100 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో వేడి చేసి, శుద్ధి చేసి ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తారు. దీని ద్వారా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పైగా ఇందులో కొవ్వు కూడా 1.5 శాతమే ఉంటుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు ఈ రకం పాలను తీసుకోవచ్చు. ఇవి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

ఆవు పాలే మేలు..!

మన ఆరోగ్యానికి గేదె పాల కంటే ఆవు పాలే ఎంతో శ్రేయస్కరమని మన పెద్దలు చెప్పే విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో ఎ1, ఎ2 రకం ఆవు పాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశానికి చెందిన ఒంగోలు, గిర్, సహివాల్ మొదలైన జాతులు ఇచ్చే పాలను 'ఎ2' రకం పాలు అంటారు. పైన చెప్పిన మన జాతి ఆవులకూ, జెర్సీ (విదేశీ జాతి) ఆవులకు క్రాస్ బ్రీడింగ్‌లో పుట్టిన హైబ్రిడ్ ఆవులిచ్చే పాలను 'ఎ1' రకమని అంటారు. ఆరోగ్యం విషయంలో ఎ1 కంటే ఎ2 రకం పాల వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువని చెబుతున్నారు నిపుణులు.

కల్తీ పాలతో జాగ్రత్త..!

ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో లభించే సుమారు 68% పాల ఉత్పత్తులు 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' సూచించిన ప్రమాణాలను పాటించకపోవడం గమనార్హం. పైగా మార్కెట్‌లో లభించే కల్తీ పాల గురించి తరచూ మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. ఈక్రమంలో కల్తీ పాల తయారీలో డిటర్జెంట్, వంట సోడా, గ్లూకోజ్ పౌడర్, వైట్ పెయింట్, రిఫైన్డ్ ఆయిల్... మొదలైనవి వాడుతుంటారు. వీటిని తాగడం వల్ల భవిష్యత్తులో మనం తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.

ఏదిఏమైనా నిత్యావసర వస్తువుల్లో ప్రధానంగా భావించే పాలను కొనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదంటున్నారు వైద్య నిపుణులు. ఈక్రమంలో ప్యాకెట్లలో లభించే పాల కంటే స్వదేశీ ఆవులు, గేదెలు ఇచ్చే పాలను తీసుకోవడం మేలని వాళ్లు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్