Airindia: కాసేపట్లో టేకాఫ్‌.. ఇంతలోనే విమానం నుంచి పొగలు.. ప్రయాణికుల పరుగులు!

మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయల్దేరేందుకు సిద్ధమవుతున్న ఎయిరిండియా(Airindia) ఎక్స్‌ప్రెస్‌ విమానం నుంచి.....

Updated : 14 Sep 2022 15:58 IST

మస్కట్‌: ఎయిరిండియా(Airindia) ఎక్స్‌ప్రెస్‌ విమానం నుంచి పొగలు రావడం కలకలం రేపింది.  ఒమన్‌ రాజధాని మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయల్దేరేందుకు సిద్ధమవుతున్న బోయింగ్‌ 737-800 విమానం రన్‌వేపై ఉన్న సమయంలోనే ఇంజిన్‌ నుంచి పొగలు వ్యాపించడంతో అంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన విమానం నుంచి కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. భయంతో ప్రయాణికులు పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.  ఈ ఘటనలో14మందికి గాయాలైనట్టు సమాచారం.  

ప్రమాదం సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. అలాగే, మరో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు.  ప్రయాణికులందరినీ ఖాళీ చేయించిన విమానాశ్రయ సిబ్బంది వారిని సురక్షితంగా టెర్మినల్‌ భవనంలోకి తరలించారు. 

మరోవైపు, మస్కట్‌ నుంచి కొచ్చికి ప్రయాణికులను తరలించేందుకు మరో విమాన సర్వీసు ఏర్పాటు చేస్తున్నట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు, రెండు నెలల క్రితం కూడా కాలికట్‌ నుంచి దుబాయికి వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో కాలిన వాసన రావడంతో ఆ విమానాన్ని మస్కట్‌కు మళ్లించాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని